ఉత్తరప్రదేశ్ మహిళా శిక్షక్ సంఘ్ నెలసరిలో మహిళల సమస్యలపై గళమెత్తింది. ప్రతి నెలా నెలసరి సెలవులను కేటాయించాలంటూ ఆ సంస్థ అధ్యక్షురాలు సులోచనా మౌర్య ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు అనామిక చౌదరిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించింది. ఈ సెలవులను ప్రత్యేకంగా పరిగణించాలని, మిగతా వాటితో కలపకూడదని కోరింది. రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ఈ సౌకర్యాన్ని కల్పించాలంది.
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి...
దేశంలో పలు ప్రైవేటు సంస్థలు నెలసరి సెలవులను ఇస్తున్నాయని, యూపీ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించాలని కోరింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దృష్టికి తీసుకెళతానని అనామిక చౌదరి చెప్పింది. ఆ మూడు రోజులూ ఎంత అసౌకర్యంగా ఉన్నా నిలబడి విధులు నిర్వహించే మహిళా ఉపాధ్యాయుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా ఈ సెలవులను ఆచరణలోకి తేవడానికి కృషి చేయాలని కోరింది.
రాష్ట్ర గవర్నరు ఆనంది బెన్‌ను కలిసేందుకు ప్రయత్నాలు..
ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగు దొడ్ల అశుభ్రత వల్ల కూడా ఆ సమయంలో ఉపాధ్యాయినులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఈ సంఘం ప్రస్తావించింది. ఈ సెలవుల విషయంలో రాష్ట్ర గవర్నరు ఆనంది బెన్‌ను కూడా కలిసే ప్రయత్నాల్లో సంఘ సభ్యులు ఉన్నారు. ఈ అంశంపై అవగాహన తీసుకొచ్చేందుకు ఆన్‌లైన్‌లో ‘పీరియడ్ లీవ్ హ్యాష్‌ట్యాగ్’ ప్రచారాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఈ సౌకర్యం వస్తే కాస్తైనా ఊరట కదూ!
ఇదీ చూడండి: NAGARJUNA SAGAR: జలాశయానికి తగ్గుతున్న వరద.. ఔట్‌ఫ్లో 2,67,229 క్యూసెక్కులు