ఎవరైనా మనకు వ్యతిరేకంగా ఏదైనా అంటే చాలు వెంటనే బాధపడిపోతాం. వాళ్ల మాటలు పట్టించుకోకపోతే ఏ బాధా ఉండదు. కానీ మన మనసు మాత్రం వాళ్ల మాటలు పట్టించుకోకుండా ఉండడానికి అంగీకరించదు. వాస్తవంగా ఆలోచిస్తే.. ఎవరో ఏదో అన్నారని మనమెందుకు బాధపడాలి? అలా ఉండడం కొంచెం కష్టమే. అయినప్పటికీ మీ సంతోషం కోల్పోకుండా ఉండాలంటే ఇతరుల మాటలు, చవకబారు వ్యాఖ్యలు... ఇలాంటివేవీ పట్టించుకోకుండా ఉండాలి. ఇలా ప్రయత్నిస్తే చాలా వరకు మీరు హ్యాపీగా ఉండచ్చు.
అనుకోని సంఘటనలు..
మిత్రులు, ఆత్మీయులను కోల్పోవాల్సి రావడం ఎంతో బాధాకరం. ఇలాంటి సంఘటనలు మనసుని గాయపరుస్తాయి. అయితే పూర్తిగా ఆ విషాదంలోనే ఉండిపోకుండా వీలైనంత తొందరగా దాని నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాలి. మీ దృష్టి బిజీ పనులపై కేంద్రీకరిస్తే ఆ బాధ నుంచి చాలా వరకు బయటపడొచ్చు.

హాబీలపై దృష్టి సారించండి...
కొన్ని సందర్భాల్లో ఖాళీగా ఉండడం కూడా దిగులుకు కారణం కావచ్చు. అలాగే రొటీన్‌గా చేస్తున్న వర్క్ బోర్‌గా అనిపించొచ్చు కూడా. ఇలాంటప్పుడు మీ హాబీలపై దృష్టి సారిస్తే చిరాకు, బోర్ దరిచేరవు. అంతేకాకుండా వీటి స్థానంలో కొత్త ఉత్సాహం వచ్చి చేరుతుంది. అందుకే మీ హాబీల కోసం ఎంతో కొంత సమయాన్ని కేటాయించండి. ఆనందాన్ని ఉచితంగా పొందండి.
తీరిక చేసుకోండి...
మీరు ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు మిత్రులు, కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని కేటాయించడం మరవద్దు. మధ్య మధ్యలో ఫ్రెండ్స్‌ని కలుస్తుండడం, కుదిరినప్పుడు కుటుంబ సభ్యులను సినిమా, పార్కు, హోటల్‌కు తీసుకెళ్లడం లాంటి పనులన్నీ హ్యాపీగా ఉంచేవే. ఇలా చేయడం వల్ల మీతో పాటు వాళ్లుకూడా ఆనందిస్తారు. దీంతో మీ సంతోషం రెట్టింపవుతుంది.

పోలిక వద్దు...
ఎక్కువ మంది మానసిక ప్రశాంతతను కోల్పోవడానికి ముఖ్యమైన కారణాల్లో ఒకటి తమను తాము ఇతరులతో పోల్చుకోవడం. తెలిసినవాళ్లు, చుట్టూ ఉన్నవాళ్లతో పోల్చుకుని చూసుకోవడం చాలామంది విషయంలో జరుగుతుంటుంది. కొలీగ్‌కు ప్రమోషన్ వస్తే బాధపడడం, పక్కింటి అమ్మాయికి మనకంటే ఎక్కువ మార్కులు వస్తే తట్టుకోలేక పోవడం, పిన్ని కూతురు తెల్లగా ఉంటే అయ్యో నేనంత బాగా లేనే అని కుమిలి పోవడం...ఇలా చాలామంది విషయంలో చూస్తుంటాం. అయితే పోలిక మనలో ఏదైనా సాధించాలన్న కాంక్షను లేపాలి తప్ప అసూయను కాదని గ్రహించాలి. ఎవరి బలాలు, బలహీనతలు వారికుంటాయి. రంగు, రూపుల విషయానికొస్తే అవి మన ప్రమేయం లేకుండా జరిగినవేనని గుర్తుంచుకోవాలి. అందుకే ఇతరులను చూసి ఈర్ష్య చెందకుండా నిన్నటి మీతో ఈ రోజు మిమ్మల్ని పోల్చుకోండి. ప్రగతి దిశగా అడుగులేయండి.

ప్లానింగ్ ఉందా?
మీరు చేయాల్సిన పనులు, భవిష్యత్తు లక్ష్యాలు, ఆర్థిక వ్యవహారాలు, కెరీర్... ఇలా ప్రతి విషయంలోనూ ప్రణాళిక ఉండాలి. దాని ప్రకారం నడుచుకుంటే ఒత్తిడి లేకుండా హాయిగా ఉండొచ్చు. ఉదాహరణకు ఉదయం 6 గంటలకే నిద్ర నుంచి మేల్కొనడం మీ టార్గెట్. కానీ ఏడింటికి లేచారు. దీంతో మీ పనుల షెడ్యూల్ మారుతుంది. ఫలితంగా ఒత్తిడి పెరిగి ఆనందాన్ని కోల్పోతారు. అందుకే చేసే పని ఎలాంటిదైనప్పటికీ, ఎంత చిన్నదైనప్పటికీ సరైన ప్రణాళిక వేసుకోవడం, చిత్తశుద్ధితో దాన్ని అమలు చేయడం నిరంతరం కొనసాగించాలి. ఇలా చేస్తే ఆనందాన్ని కోల్పోరు.

బోర్ కొడుతోందా?
చాలామందికి ఉద్యోగం కూడా బోర్ కొడుతుంది. ఇష్టంలేని పని చేయాల్సి రావడం, ఆఫీస్ వాతావరణం నచ్చకపోవడం, పనితీరు బాగున్నా ప్రోత్సాహం లేకపోవడం... ఇవన్నీ అసంతృప్తికి కారణం. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేస్తున్న పనిని నెమ్మదిగా ప్రేమించడం అలవాటు చేసుకోవాలి. అలా వీలుకాని పరిస్థితుల్లో కంపెనీ మారడం గురించి ఆలోచించవచ్చు.
ఆహారం, ఆరోగ్యం
ఆరోగ్యం సహకరించకపోవడం కూడా అసంతృప్తికి కారణమవుతుంది. అయితే మన అలవాట్లు మార్చుకోవడం ద్వారా కొంత వరకైనా అనారోగ్యాల బారిన పడకుండా ఉండవచ్చు. మంచి ఆహారాన్ని వేళకు మితంగా తినడాన్ని మీ దినచర్యలో భాగం చేసుకోవాలి. ప్రతి రోజూ వ్యాయామం చేయడం తప్పనిసరి కావాలి. ఫీల్ గుడ్, థింక్ గుడ్, డూ గుడ్.. ఇలా చేస్తే అన్ని రోజులూ హ్యాపీడేసే!