
అరటిపండు: జీర్ణాశయ సమస్యలకు చెక్ పెట్టగలిగే శక్తి అరటిపండుకు ఉంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్లు, మినరల్స్ శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. బాగా ఆకలి అనిపించినప్పుడు అరటిపండును తీసుకుంటే పొట్టనిండిన భావన వస్తుంది. ఎక్కువ సేపు వేరే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలాగే తక్కువ కెలోరీలుండటంతో బరువుసమస్యా ఉండదు.

గుడ్లు...: ఏ సీజన్‌లోనైనా తీసుకోగలిగే ఆహారం. సూపర్‌ఫుడ్‌గా పిలిచే ఇందులో ప్రొటీన్లు ఎక్కువ. ఇవి కండరాలను బలోపేతం చేసి, వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలో వచ్చే దగ్గు, జలుబు, జ్వరం వంటి పలు రకాల ఇన్‌ఫెక్షన్ల బారి నుంచి కాపాడతాయి.

మొక్కజొన్న...: ఉడకబెట్టిన లేదా నిప్పులపై కాల్చిన మొక్కజొన్నను తీసుకుంటే ఇందులో పుష్కలంగా ఉండే పీచు జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అధిక బరువుని నియంత్రిస్తుంది. తక్కువ కెలోరీలు ఉండే మొక్కజొన్నను వర్షాకాలమంతా తీసుకోవచ్చు. ఇందులో ఉండే ల్యూటిన్, ఫైటోకెమికల్స్ కంటి చూపును మెరుగుపరిస్తే, మంచి బ్యాక్టీరియా జీర్ణశక్తిని పెంచుతుంది.

కాలానుగుణ పండ్లు...: వర్షాకాలంలో వచ్చే లిచీ, బొప్పాయి, దానిమ్మ, జామవంటి పండ్లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి త్వరగా జీర్ణమవడమే కాకుండా వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రిస్తాయి. అలాగే జామలో ఉండే ఐరన్, ఫొలేట్, పొటాషియం నిత్యం మనల్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి.
ఇదీ చూడండి: CM KCR:వరంగల్ గ్రామీణ, అర్బన్ జిల్లాలకు కొత్త పేర్లు: కేసీఆర్