చక్కెరలు, కొవ్వులూ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకునేవాళ్లలో రోగనిరోధక శక్తి తగ్గి ఇన్ఫెక్షన్లూ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులూ పెరిగే అవకాశం ఉందని వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఎలుకల్లోనూ మనుషుల్లోనూ పరిశోధనలు చేయగా- పంచదార, కొవ్వు పదార్థాలు కారణంగా పొట్టలోని రోగనిరోధకశక్తికి సంబంధించిన కొన్ని కణాలు సరిగ్గా పనిచేయడం లేదనీ దాంతో వాళ్లు ఇన్‌ఫ్లమేషన్‌కి గురవుతున్నారని గుర్తించారు.
ఆ కణాలు సరిగ్గా పనిచేయనివాళ్లు అధిక బరువు ఉండటాన్నీ గమనించారు. ఇందుకోసం వీళ్లు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకున్నవాళ్లనీ కొవ్వులూ చక్కెర పదార్థాలూ అధికంగా ఉన్న ఆహారాన్ని తీసుకున్నవాళ్లనీ ఎనిమిది వారాలపాటు నిశితంగా పరిశీలించగా- వాళ్లలో రెండో రకం ఆహారం తీసుకున్నవాళ్లే త్వరగా బరువు పెరిగినట్లు గమనించారు. దీన్నిబట్టి దీర్ఘకాలం పాటు ఆ రకమైన ఆహారాన్ని తింటే రోగనిరోధకశక్తి బాగా దెబ్బతింటుందని చెబుతున్నారు.