తమకు సమీపంలోనే ఉన్న గోవాకు రోజూ వేలమంది పర్యటకులు వస్తుంటారు. కానీ, అందమైన మడ అడవులున్న తమ గ్రామ సందర్శనకు కొందరైనా రారెందుకు... అనుకునేది శ్వేత హూల్. ఈమెది మహారాష్ట్రలోని పశ్చిమతీరంలో ఉన్న సింధుదుర్గ్ ప్రాంతం. అక్కడ వెంగుర్ల గ్రామంలో దాదాపు 12 చ.కి.మీ. మేర మడ అడవులు ఉంటాయి. వాటి మధ్య ఏడాది పొడవునా దేశవిదేశాలకు చెందిన పక్షులు విహరిస్తూ కనువిందు చేస్తాయి. గోవా నుంచి రెండు గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు.
శ్వేత కొన్నేళ్ల కిందట ఆ ఊరి కోడలిగా వచ్చింది. తనని చూడ్డానికి వచ్చే కుటుంబ సభ్యుల్ని మడ అడవుల సందర్శనకు తీసుకువెళ్లేది. ఈమె గ్రామంలోని ‘స్వామిని’ స్వయంసహాయక సంఘానికి అధ్యక్షురాలు కూడా. ఎనిమిది మంది సభ్యులున్న ఈ బృందం వివిధ ఆదాయ మార్గాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ‘మాంగ్రూవ్ సఫారీ’ ఆలోచన వచ్చిందామెకు. బృంద సభ్యులతో చెప్పగా వాళ్లకీ నచ్చింది. ప్రభుత్వ అనుమతితో 2017 నుంచి ఇక్కడ సఫారీ నిర్వహిస్తున్నారు. తెడ్డు వేస్తూ నడిపే బోట్లలో పర్యటకుల్ని ఈ మడ అడవుల్లో తిప్పుతారు. దీనివల్ల పర్యావరణానికీ మేలు జరుగుతోంది. దాంతోపాటు ఈ బృందం ఏటా రూ.లక్షల్లో ఆదాయాన్నీ ఆర్జిస్తోంది.
- ఇదీ చూడండి : పులి మనిషిని చంపితే రూ.15 లక్షలివ్వాలి: అటవీ శాఖ