ప్రస్తుత పరిస్థితుల్లో చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అలాంటిది మీరు కొత్తగా ఉద్యోగంలో చేరి కొనసాగడం చాలా సంతోషించాల్సిన విషయం. ఆఫీసు వాతావరణంలో పనిచేయడానికీ, ఇలాంటి మహమ్మారి సమయంలో ఇంటినుంచి పనిచేయడానికీ చాలా తేడా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పనిచేయడం ఒత్తిడితో కూడుకున్న అంశమే కాదు, చాలా క్లిష్టమైన విషయం కూడా. ఉద్యోగ జీవితాన్ని ఈ పరిస్థితుల్లో ప్రారంభించడం కచ్చితంగా ఇబ్బందికరమే అయినా కూడా మీరు పనిమీద దృష్టిపెట్టి సకాలంలో టాస్క్‌లు పూర్తిచేయండి.
అదే సమయంలో పైవాళ్లతో సంప్రదించేటపుడు ఓపిగ్గా, మర్యాదపూర్వకంగా మెలగండి. వాళ్లకి మీ పనికంటే కూడా ముఖ్యమైన, అత్యవసరమైన అంశాలు ఉండొచ్చు. కాబట్టి మీ ఫోన్, మెయిల్స్‌కి వెంటనే స్పందిస్తారనుకోవద్దు. నొప్పించకుండానే వాళ్లతో మీ పని గురించి గుర్తుచేస్తుండాలి. ఈ విషయాన్ని మీ మేనేజర్ దృష్టికి తీసుకువెళ్లి మంచి పనిచేశారు.
ఎందుకంటే కంపెనీలో ఇది మీ ఒక్కరి సమస్యే కాకపోవచ్చు. రెండు వారాలకోసారైనా మేనేజర్‌కి మీ పని వివరాలు పంపుతుండండి. అదే సమయంలో పైవాళ్ల ఆలస్యం కారణంగా మీకు దొరికే ఖాళీసమయంలో నైపుణ్యాల్ని మెరుగుపర్చుకోండి. నెట్‌వర్కింగ్ పెంచుకోండి. మీ వృత్తికి సంబంధించి ఏవైనా వెబినార్‌లు ఉంటే హాజరవ్వండి. యువతలో చాలామంది కరోనా కారణంగా దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. మీరూ ఆ దిశగా ప్రయత్నం చేయండి.