ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా గంజాయి సరఫరాదారులను నాచారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 18 కిలోల గంజాయి, రూ. 28,700 నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అరెస్టైన ఇద్దరు అంతర్రాష్ట్ర మహిళా గంజాయి సరఫరాదారులు... ఏపీ విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు.
ఏజెంట్లతో సంబంధాలు ఏర్పర్చుకుని సులభంగా డబ్బు సంపాదించడం కోసం గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇద్దరు మహిళలు రెండు రోజుల కిందట 18 కిలోల గంజాయిని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
ఇవాళ ఉదయం నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో కిలో రూ. 10వేల లెక్కన విక్రయించి సొమ్ము చేసుకునేందుకు యత్నించారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌వోటీ పోలీసులు... ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకుని 18 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.