గత కొద్దిరోజులుగా కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతున్న పులిని బంధించేందుకు అటవీశాఖ అధికారులు ముమ్మర చర్యలు చేపట్టారు. మేతకు వెళ్లిన పశువులపై దాడి చేయడం, స్వల్ప వ్యవధిలో ఇద్దరిని హతమార్చటంతో పరిసర గ్రామాల్లో భయాందోళనలు నెలకొంటున్నాయి. మనుషులపై సైతం దాడికి పాల్పడుతున్న పులిని పట్టుకోవడానికి అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు.
మళ్లీ వస్తుందా..?
దహేగం, దిగిడ, పెంచికలపేట మండలం కొండపల్లిలో బోన్లు ఏర్పాటు చేసి ఎరగా మేకలు, పందులను పెట్టినప్పటికీ పులి చిక్కలేదు. ప్రయత్నం ఫలించకపోవటంతో.. అటవీ అధికారులు ప్రణాళిక మార్చి పులి సంచారం అధికంగా ఉన్న బెజ్జురు మండలంలోని తలాయి అటవీప్రాంతంలో పులికి ఎరగా అవును ఉంచారు. అవును బయట కట్టేసి ఉంచగా.. పులి అవుపై దాడి చేసి హతమార్చింది. అప్రమత్తమైన అధికారులు మృతి చెందిన ఆవు కళేబరం కోసం పులి మళ్లీ వస్తుందనే అంచనా వేస్తున్నారు. పక్కనే మంచె ఏర్పాటు చేసి నిపుణులైన షూటర్లతో మత్తు మందు ఇచ్చి పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
రహస్యంగా..
అయితే పులికి సంబంధించిన సమాచారం ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మరోవైపు బెజ్జురు మండలంలోని పలు గ్రామాల్లో పులి సంచారం పట్ల అప్రమతంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు.
అవును ఎరగా వేయడంపై అభ్యంతరం..
మనుషులను హతమరుస్తున్న పులిని బంధించేందుకు అవును ఎరగా వేయడం వివాదాస్పదమవుతుంది. దీనిపై భాజపా నాయకులు, ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. పులిని పట్టుకునేందుకు పూజించే అవును ఎరగా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇంత టెక్నాలజీ ఉన్న సమయంలో కూడా మూగ జీవిని ఎరగా వేయడం సమంజసమేనా అంటూ ప్రశ్నించారు. ఈవిషయమై అటవీ అధికారులను సంప్రదించగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు.
ఇదీ చూడండి: ఆటోతో హత్యాయత్నం.. ఒకసారి కాదు.. రెండుసార్లు!