69 కిలోమీటర్లు... 50 మూల మలుపులు... 800కుపైగా ప్రమాదాలు... 283 మంది మరణం... వందల్లో క్షతగాత్రులు... వారానికి సగటున 5 ప్రమాదాలు.. ఇవీ... రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి పరిస్థితి. అధికారికంగా నమోదైనవి మాత్రమే ఇవి. కానీ అంతకుమించిన ప్రమాదాలు, అంతులేని విషాదాన్ని మిగిల్చిన ఘటనలు ఈ జాతీయ రహదారిపై అనేకం. ప్రమాదంలో గాయపడ్డ వారిని కూడా సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లలేని దుస్థితి ఈ రహదారి సొంతం. 30 కిలోమీటర్ల కంటే మించని వేగం.. 40 దాటితే వెంటాడే మృత్యువు... దానికి తోడు మూల మలుపులు. వెరిసి... అత్యంత ప్రమాదకరంగా మారింది హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి.
తెలంగాణ - కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, చేవెళ్ల, వికారాబాద్ జిల్లా పరిగి, కొడంగల్ మీదుగా ఈ జాతీయ రహదారి సాగుతుంటుంది. కర్ణాటకలోని గుల్బర్గా, బీజాపూర్ తోపాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే కీలకం. అలాగే నగరానికి అత్యంత సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతం అనంతగిరికి వెళ్లే మార్గం ఇదొక్కటే కావడంతో ఈ రోడ్డుపై రాకపోకలు గతంలో కంటే గణనీయంగా పెరిగాయి. వారాంతాల్లో హైదరాబాద్ నుంచి ఎక్కువ మంది ఇటువైపు ప్రయాణిస్తుంటారు. మరోవైపు మొయినాబాద్, చేవెళ్ల, మన్నెగూడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉద్యోగ, ఉపాధి కోసం నిత్యం భాగ్యనగరానికి వచ్చిపోతుండగా.. రైతులు పంట ఉత్పత్తులను తరలిస్తుంటారు. దీంతో ఈ మార్గంలో వాహనాల సంఖ్య గతంలో కంటే రెట్టింపైంది. నిమిషానికి సుమారు 40 నుంచి 50 వాహనాలు ఈ జాతీయ రహదారిపై ప్రయాణిస్తుంటాయి.
వారానికి 3 నుంచి 5 రోడ్డు ప్రమాదాలు
అయితే ఈ మార్గంలో ప్రయాణం వాహనదారులను బెంబేలెత్తిస్తోంది. అడుగడుగునా గుంతలు, ఆపై మూలమలుపులతో ఎప్పుడు ఏ ప్రమాదం ఎదురవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. తెలంగాణ పోలీస్ అకాడమి నుంచి చిలుకూరు చౌరస్తా వరకు 11 మూలమలుపులు ఉండగా... జేబీఐటీ చౌరస్తా నుంచి చేవెళ్ల, మన్నెగూడ వరకు 38 మలుపులున్నాయి. వాటిలో మొయినాబాద్ మండలం అజీజ్ నగర్, మొయినాబాద్, చిన్నషాపూర్... కనకమామిడి, కేతిరెడ్డిపల్లి, చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల్, కందవాడ, మల్కాపూర్, దామరగిద్ద, మిర్జాగూడ, ఆలూరు వద్ద ఉన్న మలుపులు అత్యంత ప్రమాదకరంగా మారాయి. తరచూ వీటివద్ద రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ప్రమాదం జరిగిదంటే ప్రాణాలు పోవాల్సిందే. ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించనంత మలుపులు ఉండటం, ఎలాంటి జాగ్రత్త చర్యలు లేకపోవడం తరుచూ ప్రమాదాలకు కారణామవుతున్నాయి. వాహనదారులు ఎంత జాగ్రత్తగా నడిపినా నెత్తురోడక తప్పడం లేదు. దీంతో ఈ మూల మలుపుల వద్ద వారానికి 3 నుంచి 5 ప్రమాదాలు చోటు చేసుకుంటుండటం వాహనదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.
64 మంది మృతి.. 265 మందికి గాయాలు
గత నాలుగేళ్లలో ఈ జాతీయ రహదారిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో 304 ప్రమాదాలు చోటుచేసుకోగా.. 64 మంది మృతి చెందారు. 265 మందికి గాయాలయ్యాయి. అటు చేవెళ్ల ఠాణా పరిధిలోనూ వరుస ప్రమాదాలు దడ పుట్టిస్తున్నాయి. ఇటీవల కందాడ - మల్కాపూర్ మలుపు వద్ద బోర్ వెల్ లారీని ఇన్నోవా కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందగా.. అదే రోజు సాయంత్రం ఊరెళ్లకి చెందిన అంబులెన్స్ డ్రైవర్ సునీల్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో సునీల్ అక్కడిక్కడే ప్రాణాలొదిలాడు. ఇలా... మూడేళ్లలో 210 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. 88 మంది చనిపోయారు. 250 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. ఇక చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 120 ప్రమాదాలు చోటుచేసుకోగా.. 140 మంది మరణించారు. 246 మంది గాయపడ్డారు. ఇంకా ఈ రహదారిపై అనధికారికంగా మరెన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
రోడ్డు విస్తరణ చేయకపోవడమే కారణం
ఇలా వరుస ప్రమాదాలకు రోడ్డు విస్తరణ చేయకపోవడమే ప్రధాన కారణమంటోన్న స్థానికులు.. వాహనాల సంఖ్య రెట్టింపవుతున్నా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం లేదని విమర్శిస్తున్నారు. మూల మలుపుల వద్ద పెద్ద సంఖ్యలో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
కోల్పోతున్న వందల ప్రాణాలు
జాతీయ రహదారుల విస్తరణలో భాగంగా 2016లో హైదరాబాద్-బీజాపూర్ రహదారిని జాతీయ రహదారిగా ప్రకటించారు. తెలంగాణ పోలీస్ అకాడమి నుంచి మన్నెగూడ వరకు 4 వరుసలుగా మార్చాలని నిర్ణయించారు. 2018లో 163వ జాతీయ రహదారిగా గుర్తించి భూసేకరణ చేపట్టారు. అందులో టిప్పుఖాన్ వంతెన నుంచి మొయినాబాద్ వరకు 56 కోట్ల రూపాయలతో 4 వరుసలుగా మార్చారు. అక్కడి నుంచి మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి భూసేకరణ చేపట్టారు. 740 కోట్ల రూపాయలతో ఏడాదిలోగా పనులు పూర్తి చేయాల్సి ఉండగా అర్థాంతరంగా ఆపేశారు. 2019లో ఈ రహదారిని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధీనంలోకి తీసుకుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఈ రహదారి పనులు.. ముందుకు సాగకపోవడంతో వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణపై దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం... హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారిపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ప్రమాదాలకు కారణమవుతున్న మూల మలుపులను సవరించి వాహనదారుల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి:'2050కల్లా 4.5కోట్ల మంది భారతీయుల వలస'