హైదరాబాద్ కూకట్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో మద్దెల శ్రీనివాస్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ముళ్లకత్వ చెరువు బతుకమ్మ కుంటలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
మెట్టుగూడకు చెందిన శ్రీనివాస్, అతని భార్య అలేఖ్య మధ్య గత నెల 30న గొడవ జరిగింది. కుటుంబ సభ్యులు దంపతులిద్దరికీ సర్దిచెప్పారు. జూన్ 1 సోమవారం రోజున తన సోదరిని ఇంటి వద్ద విడిచిపెట్టి వస్తానని బయటకు వెళ్లిన శ్రీనివాస్ మళ్లీ తిరిగి రాలేదు. ఈ క్రమంలో తన భర్త కనిపించడం లేదని అలేఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈరోజు ముళ్లకత్వ చెరువు బతుకమ్మ కుంటలో శ్రీనివాస్ మృతదేహం లభ్యమయింది. భార్యతో కలహం వల్ల మానసిక ఒత్తిడికి లోనై.. బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని బంధువులు ఆరోపించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.