ఆదిలాబాద్ జిల్లాలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకంలో జరిగిన అవకతవకలపై ఈటీవీభారత్, ఈటీవీ-ఈనాడు వరుస కథనాలతో... అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. ఆదిలాబాద్ ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ సెక్షన్ ఉద్యోగి నదీంను... కలెక్టర్ సిక్తా పట్నాయక్ సస్పెండ్ చేశారు. సిరికొండ, గుడిహత్నూర్, బోథ్ మండలాల్లోనే.... 31లక్షలకుపైగా అవినీతి జరిగినట్లు నిర్ధారణయింది. ఉమ్మడి జిల్లాలోని 72 మండలాల పరిధిలో ఇంకా ఎన్ని అక్రమాలు జరిగి ఉండవచ్చనే కోణంలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
బినామీ పత్రాలతో..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం అమలులో.. అక్రమాలకు తావులేకుండా ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది నుంచి ఆర్డీవో వరకు అన్నికోణాల్లో విచారించి లబ్ధిదారులని తేలితేనే... ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ చేస్తున్నారు. కానీ జైనథ్, సిరికొండ, ఇచ్చోడ, బోథ్, గుడిహత్నూర్ మండలాల్లో... మీ సేవా కేంద్రాల బినామీ పత్రాలే ఆధారంగా లక్షల్లో అవినీతి జరగడం రాజకీయవర్గాల్లోనూ చర్చ జరిగేలా చేస్తోంది. అక్రమాలపై లోతుగా విచారణ జరిపి అధికారపార్టీ నేతలు నిజాయతీ నిరూపించుకోవాలని స్థానిక కాంగ్రెస్, భాజపా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా వెలుగుచూసిన ఈ అక్రమాల వల్ల అనేక మంది అర్హులైన పేదలకు ప్రభుత్వ సాయం అందక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని... అవినీతికి ఆస్కారం లేకుండా పేదలకు సాయం అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ఈటీవీ భారత్ ఎఫెక్ట్: అవినీతిపై అధికారులు అప్రమత్తం