ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియను జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈరోజు ఉదయం అఖిలప్రియ తనకు అనారోగ్యంగా ఉన్న విషయాన్ని జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జైలు అధికారులు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అఖిలప్రియకు పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. కళ్లు తిరుగుతున్నాయని అఖిల ప్రియ వైద్యులకు తెలిపింది. దానికి తగిన చికిత్స నిర్వహించిన వైద్యులు అనంతరం కొన్ని ఔషధాలు రాసి ఇచ్చారు.
నిన్న సాయంత్రం సమయంలోనూ అఖిలప్రియను జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అఖిలప్రియ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందని.. తరచూ మూర్చ వ్యాధి వచ్చి కింద పడుతుందని ఆమె తరఫు న్యాయవాది సికింద్రాబాద్ న్యాయస్థానంలో న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో అఖిలప్రియ ఆరోగ్య స్థితిపై నివేదిక ఇవ్వాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈమేరకు జైలు అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లటంతో వైద్యులు సిటీ స్కాన్, ఎన్ఆర్ఐతో పాటు ఇతర పరీక్షలు నిర్వహించారు. వైద్యులు తమ నివేదికను జైలు అధికారులకు అందించారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు జైలు అధికారులు సోమవారం ఈ నివేదికను న్యాయమూర్తికి సమర్పించనున్నారు.
ఇదీ చదవండి: మొదటి కరోనా వ్యాక్సిన్ నేనే తీసుకుంటా: మంత్రి ఈటల