వారం రోజులు ఆశ్రయమిచ్చిన పిన్నిని హత్య చేసిన ఘటన బోధన్ మండలంలో చోటు చేసుకుంది. పట్టణ శివారులోని గృహకల్ప నివాసాల వెనుక బీడు భూమిలో నాలుగు రోజుల క్రితం లభ్యమైన మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఏసీపీ రామారావు వివరాలు వెల్లడించారు.
షన్నుబేగం(28)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త వదిలేయడంతో కూలీ పనులు చేసుకుంటూ ఆటోనగర్‌లో నివసిస్తోంది. ఆమె అక్క కొడుకు నబీ ఖురేషీ(21) ఇటీవల ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తల్లి ఇంట్లోకి రానీయలేదు. అతనికి పిన్ని ఆశ్రయం కల్పించింది. వారం రోజుల తర్వాత ఇంట్లో నుంచి వెళ్లమని కోరడంతో బయట ఉండలేమని భావించి హత్యకు ప్రణాళిక రచించారు.
హత్య చేస్తే అదే ఇంట్లో ఎప్పటికీ ఉండిపోవచ్చని భావించారు. షన్నుబేగం నిద్రిస్తున్న సమయంలో భార్యతో కలిసి మెడకు విద్యుత్తు తీగ బిగించి చంపేశారు. మృతదేహాన్ని సంచిలో పెట్టి దూరంగా పడేశారు. సీఐ రాకేష్ నేతృత్వంలో దర్యాప్తు నిర్వహించి హత్య కేసును ఛేదించారు. నిందితులను అరెస్టు చేసి రిమాండుకు పంపించినట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: తల్లిదండ్రుల చెంతకు.. తప్పిపోయిన బాలుడు