అస్వస్థతకు గురై బస్సులో నుంచి కిందికి దిగిన వ్యక్తిని ఎవరూ పట్టించుకోలేదు. ఫలితం ఆయన ప్రయాణం మార్గమధ్యంలోనే ఆగిపోయింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంటలో జరిగింది. సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌కు చెందిన విశ్రాంత ఉద్యోగి శ్రీనివాసరావు.. కామారెడ్డి నుంచి సికింద్రాబాద్‌కు ఆర్టీసీ బస్సులో బయలుదేరారు. చేగుంట సమీపంలోకి రాగానే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే బస్సు డ్రైవర్, కండక్టర్‌కు చెప్పి ఆయన అక్కడే దిగిపోయారు. రోడ్డు పక్కన అవస్థ పడుతూ పడుకున్నారు. రెండు గంటలకు పైగా శ్వాస తీసుకోవడంలో యాతన పడ్డారు.
ఇబ్బంది పడుతుండగా.. అటువైపుగా వచ్చిన జడ్పీటీసీ సభ్యుడు ముదాం శ్రీనివాస్, పలువురు స్థానికులు గమనించి జిల్లా వైద్యాధికారులకు సమాచారం అందించారు. కొద్దిసేపటికి తూప్రాన్ నుంచి 108 అంబులెన్స్ వచ్చింది. కానీ తీసుకెళ్లకుండానే వెళ్లిపోయింది. తర్వాత మెదక్ నుంచి మరో అంబులెన్స్ వచ్చినా.. అప్పటికే సమయం మించిపోయింది. శ్రీనివాస్ అర్ధాంతరంగా ప్రాణాలు వదిలారు. చుట్టుపక్కల వారికి, తోటి ప్రయాణికులకు, పోలీసులకు, వైద్య సిబ్బందికి ఆయన అవస్థ తెలిసినా.. కరోనా అనుమానంతో దగ్గరికి వెళితే ఏమవుతుందోననే భయంతో దగ్గరికి వెళ్లలేదు.
దూరం నిలబడి కొందరు ఆయనతో మాట్లాడినప్పుడు తన పేరు, ప్రాంతం, ఫోన్ నంబరు చెప్పారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేయగా వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆస్తమాతో బాధపడుతూ మృతి చెంది ఉండవచ్చని జిల్లా వైద్యాధికారి వెంకటేశ్వర్ రావు తెలిపారు.
ఇదీ చూడండి: తెలంగాణలో కొత్తగా 253 మందికి కరోనా... 4,737కు చేరిన కేసులు