మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని చైతన్య నగర్లో నివాసం ఉండే సాధిక్ భార్యాపిల్లలతో కలిసి శంషాబాద్ పరిధిలోని గగన్పహడ్లోని అత్తగారింటికి వెళ్లారు. సోమవారం ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబంలో తల్లి సహా.. ఇద్దరు పిల్లలను బలి తీసుకోగా తండ్రి, చిన్న కూతురు చావు నుంచి తప్పించుకున్నారు.
జడ్చర్లలోని చైతన్య నగర్లో నివాసం ఉండే సాధిక్ లారీ డ్రైవర్గా పని చేస్తూ భార్య ముగ్గురు పిల్లల జీవనం గడుపుతున్నాడు. వారం రోజుల క్రితం తన అత్తగారింటికి భార్య కరీనా బేగం పిల్లలు ఆయాన్, సోహెల్, ఆలియాతో కలిసి గగన్ పహడ్కు వెళ్లారు. భారీ వర్షాలకు అర్ధరాత్రి గగన్ పహడ్లోని చెరువు కట్ట తెగిపోయి.. వారు నిద్రిస్తున్న ఇల్లు నీటమునిగింది. సాదిక్ తన కూతురు ఆలియాతో కలిసి ఇంటిపై సజ్జ పైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. భార్య, ఇద్దరు కుమారులను కూడా సజ్జెపైనే ఉండాలని వారించినా.. కరీనా బేగం వినకుండా.. ప్రాణాలు దక్కించుకోడాని.. సమీపంలో ఉన్న ఫంక్షన్ హాల్ వైపు వెళ్ళింది. నీటి ఉద్ధృతి పెరిగి.. అందులో కొట్టుకుపోయారు. వరద ప్రవాహం తగ్గిన తర్వాత వెతకగా.. కరీనా, సోహెల్ మృతదేహాలు దొరికాయి. కానీ.. పెద్ద కుమారుడు అయాన్ మృతదేహం ఇంకా దొరకలేదు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో విషాదం నింపింది.
ఇవీచూడండి: రామలింగారెడ్డికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు