రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఆర్మీ జవాన్ 20 రోజులుగా మృత్యువుతో పోరాడి శుక్రవారం మృతి చెందిన సంఘటన నిజామాబాద్‌లో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం మెగ్యా నాయక్ తండాకు చెందిన భారత ఆర్మీ జవాన్ మోతీలాల్ (25)డిసెంబర్లో సెలవులపై స్వగ్రామం వచ్చారు. డిసెంబర్ 30తో సెలవులు పూర్తి కానుండటం వల్ల 29న స్నేహితుడిని కలిసేందుకు తన ద్విచక్రవాహనంపై కామారెడ్డి వెళ్లారు.

తిరుగు ప్రయాణంలో సదాశివనగర్ మండలం వద్ద 44వ జాతీయ రహదారిపై ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మోతీలాల్‌ను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. 20 రోజులుగా కోమాలో ఉన్న మోతీలాల్‌ను మెరుగైన చికిత్స కోసం అక్కణ్నుంచి ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమించి గురువారం రాత్రి మోతీలాల్ మృతి చెందారు. వాన్ మృతితో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మోతీలాల్ మృతికి పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు సంతాపం వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం అతని స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నాయి.
- ఇదీ చూడండి : పతంగి ఎగరేస్తూ వెళ్లి కాలువలో శవమై తేలిన చిన్నారి