నాగర్‌కర్నూల్ జిల్లా పదర మండల కేంద్రంలో స్థానిక వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్‌కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
ఏమైందంటే..
నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన మాదాసి కురువ పాలెంకయ్య, సుగుణమ్మల కుమార్తె వీరలక్ష్మిని హైదరాబాద్‌కు చెందిన చరణ్‌కు ఇచ్చి పదేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. దంపతులిద్దరూ గత కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉండే పదర మండల వైస్ ఎంపీపీ వరుణ్ కుమార్ వద్ద ఫౌల్ట్రీలో సహాయకులుగా పని చేస్తున్నారు. కాగా వైస్ ఎంపీపీ వరుణ్‌కుమార్‌కు చరణ్ భార్య వీరలక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. వైస్ ఎంపీపీ చరణ్‌ను, అతని పిల్లలను కొట్టి తరిమేశాడు.
తన భార్యను కాపురానికి పంపడం లేదంటూ తన అత్త మామలను తీసుకుని వరుణ్ కుమార్ వద్దకు వెళ్లగా వారి మీదా దాడి చేశాడు. ఈ క్రమంలోనే బాధిత కుటుంబ సభ్యులు, వంకేశ్వరం గ్రామస్థులు వైస్ ఎంపీపీకి నిరసనగా ధర్నా చేపట్టారు. ఆయన దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఓ ప్రజాప్రతినిధి ఇలా చేయడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు న్యాయం చేస్తామని హమీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.