సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నా... ప్రజలు చిత్తవుతూనే ఉన్నారు. అమాయకులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఖైరతాబాద్‌కు చెందిన వెంకటేశ్వరరావు ఖాతాలోంచి గత రెండు రోజుల్లో రూ. 5.70 లక్షలు మాయమవ్వగా బాధితుడు వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తన క్రెడిట్ కార్డు తన దగ్గరే ఉన్నా ఖాతాలోంచి రూ. 2.7 లక్షలు పోయినట్లు సికింద్రాబాద్‌కు చెందిన హమీద్ తెలిపారు. హమీద్‌కు ఇటీవల క్రెడిట్ కార్డును ఉపయోగించే అవసరం రాకపోయినా.. తన ఖాతాలో నుంచి డబ్బు మాయమవుతోందంటూ సీసీఎస్‌కు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బంజారాహిల్స్‌కు చెందిన డా. ప్రమోద్ జోషికి తన ఛైర్మన్ నుంచి ఈ-మెయిల్ వచ్చింది. అత్యవసరంగా 1.50 లక్షలు పంపించాలని దాని సారాంశం. వెంటనే ఈ-మెయిల్లో ఉన్న బ్యాంక్ ఖాతాకు నగదు బదిలీ చేశారు. మరుసటి రోజు ఆసుపత్రికి వెళ్లినప్పుడు ఛైర్మన్‌ను కలిసి... డబ్బుల గురించి ప్రస్తావించాడు. తాను మెయిల్ పంపించ లేదని చెప్పగా బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: మహిళల్లో కరోనా ప్రభావం తక్కువ.. కారణం అదే!