కేకు పేరుతో ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ప్రధాన కార్యదర్శి కుమార్తెకు రూ.44వేలు టోకరా వేసిన సంఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా వెలుగుచూసింది. జూబ్లీహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నివసించే విశ్రాంత ఐఏఎస్ అనీల్ చంద్ర పునేత కుమార్తె అదితి పునేతకు జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 14లో బేకర్ ఆన్ ది హిల్ అనే స్టోర్ ఉంది. ఈ నెల 13న ఆమెకు ఓ వ్యక్తి ఫోన్ చేసి శ్రీకాంత్‌వర్మగా పరిచయం చేసుకుని కేక్ ఆర్డర్ ఇచ్చారు. తాను ఆర్మీలో పనిచేస్తానని చెల్లింపులకు సంబంధించి తమకు కొన్ని ప్రొటోకాల్స్ ఉంటాయని తెలిపారు. ఒక లింకు పంపి రూ.5, రూ.10 పంపమని కోరారు. అందుకు ఆమె వాటిని పంపడంతో వర్మ తిరిగి రూ.10 పంపారు. అంతా సరిపోలిందని భావించిన అనంతరం కేకుకు సంబంధించి రూ.7400ల లింకు పంపుతానని ఆ డబ్బులు లింకు ద్వారా చెల్లిస్తే తిరిగి తాను చెల్లిస్తానని వర్మ ఆమెను నమ్మించాడు. ఇందుకు సంబంధించి ఆమె యూపీఐ పిన్‌ను నమోదు చేసి రూ.7400 పంపారు. అయితే డబ్బులు తన ఖాతాలోకి జమ కాలేదని నమ్మించి మరో రెండు సార్లు అదే లింకును పంపారు. ఆయా లింకును అప్రూవ్ చేసినప్పటికి ఎలాంటి పిన్ అందులో నమోదు చేయలేదు.
అయినప్పటికి రూ.7400ల వంతును రెండుసార్లు డబ్బులు ఆమె ఖాతాలో నుంచి కట్ అయ్యాయి. తన ఖాతాలో డబ్బులు కట్ అయిన విషయాన్ని తెలియజేసి డబ్బులు తిరిగి పంపాల్సిందిగా ఆమె కోరగా ఒకేసారి రూ.22వేలు పంపిస్తానంటూ లింకును పంపి ఎలాంటి యూపీఐ పిన్ లేకుండానే తన ఖాతాలోకి మరో రూ.22వేలు మళ్లించుకున్నాడు. దీంతో మోసాన్ని గ్రహించిన అదితి పునేత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఈ నెల 13న సెక్షన్ 419, 420, సెక్షన్ 66(సి)(డి) ఆప్ ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా తాను మొదటిసారి యూపీఐ పిన్ నంబరు నమోదు చేశానని, మిగిలిన లావాదేవీల విషయంలో కేవలం లింకును అప్రూవ్ చేశానని, ఎలాంటి పిన్‌ను నమోదు చేయలేదంటూ పునేత ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఒక్క క్లిక్‌తో.. రూ. లక్షల్లో ఆదాయం... నిజమేనా?