వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో పొదుపు సంఘాల భవనాల్లో అర్ధరాత్రి సినీ ఫక్కీలో గుర్తుతెలియని దుండగలు చోరీ చేశారు. భవనాల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు విద్యుత్ సరఫరాను కట్చేసి దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయాన్నే దొంగతనాన్ని గుర్తించిన స్థానికులు పొదుపు సంఘాల సభ్యులకు సమాచారం అందించారు.
సంఘ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... డాగ్స్ స్క్వాడ్, క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నారు. పురుష పొదుపు సంఘ భవనంలో నగదు ఏమీ లేకపోవడంతో చోరీ ఏమి జరగలేదు. మహిళల పొదుపు సంఘ భవనంలో నిన్న గ్రామంలో మహిళా పొదుపు సంఘాల సభ్యుల నుంచి జమ చేసిన నెలవారి పొదుపు డబ్బులు దాదాపు లక్ష రూపాయల వరకు చోరికి గురైనట్లు సభ్యులు తెలిపారు.
రెండు నెలలుగా భీమదేవరపల్లి మండలంలో ఎలాంటి ఆధారాలు దొరకకుండా గుర్తుతెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడుతుండటంతో మండల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. క్లూస్ టీంతో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎల్కతుర్తి సర్కిల్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.