ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసును ఛేదించేందుకు రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నెలరోజుల విరామం తర్వాత మళ్లీ కడపకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దఫాలుగా పులివెందుల, కడప ప్రాంతాల్లో అనుమానితులను విచారించిన సీబీఐ అధికారులు.. కీలక ఆధారాల సేకరణ కోసం మరోసారి కడప జిల్లాకు రానున్నారు. ఈ ఏడాది జులై 18న తొలిసారిగా కడప జిల్లాకు వచ్చిన సీబీఐ అధికారులు రెండు వారాల పాటు అనుమానితులను కడప, పులివెందులలో విచారించి వెళ్లారు. తర్వాత రెండో దఫా విచారణ సెప్టెంబరు 12 నుంచి చేపట్టారు. దాదాపు నెలరోజుల పాటు విచారణ చేసిన తర్వాత కొందరు సీబీఐ అధికారులకు కరోనా సోకడంతో విచారణకు అంతరాయం కలిగింది.
మళ్లీ విచారణ..
ఆ సమయంలోనే పులివెందుల కోర్టులో వివేకా హత్య కేసుకు సంబంధించిన ఆధారాలు కావాలని కోరుతూ సీబీఐ పిటిషన్ వేసింది. పులివెందుల కోర్టు ఆధారాలు ఇవ్వడానికి నిరాకరించడంతో.. ఇపుడు ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఫలితంగా ఈనెల 2వ తేదీన సీబీఐ అధికారులు హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. పులివెందుల కోర్టులో ఉన్న ఆధారాలను దర్యాప్తు చేయడానికి అనువుగా సీబీఐకి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ వేశారు. సీబీఐ అడిగిన వివరాలను వెంటనే ఇవ్వాలని పులివెందుల మెజిస్ట్రేట్ ను ఆదేశిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మరోసారి సీబీఐ అధికారులు పులివెందులకు వచ్చి వివేకా హత్య కేసుకు సంబంధించిన వివరాలను కోర్టు ద్వారా తీసుకుని మళ్లీ విచారణ ప్రారంభించే వీలుందని తెలుస్తోంది.
వివేకా హత్య జరిగిన తర్వాత 3 సార్లు ఏర్పాటు చేసిన సిట్ నివేదికలను ఇప్పటికే పోలీసులు సీబీఐకి అప్పగించారు. పులివెందుల కోర్టులో కొన్ని కీలక ఆధారాలు ఉన్నాయి. వివేకానందరెడ్డి ప్రధాన అనుచరుడు ఎర్రగంగిరెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, వంటమనిషి కుమారుడు ప్రకాశ్ ను విచారించే సమయంలో ఆడియో, వీడియో రికార్డింగ్ చేశారు. వారి నేరంగీకార పత్రాలను నమోదు చేసి పులివెందుల కోర్టుకు సమర్పించారు. ఇవి తీసుకోవడానికి సీబీఐ అధికారులు కోర్టును అభ్యర్థించినట్లు తెలుస్తోంది. వీటితోపాటు ముగ్గురు అనుమానితులకు నార్కో పరీక్షల వివరాలు, వివేకా బెడ్ రూంలో దొరికిన లేఖ.. దానికి సంబంధించిన ఫోరెన్సిక్ రిపోర్ట్ పులివెందుల కోర్టులోనే ఉన్నాయి. ఇవి తీసుకుంటే దర్యాప్తునకు మరింత ఉపయోగ పడతాయనే భావన సీబీఐ అధికారుల్లో ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి: మహిళ మెడలో పుస్తెలతాడు ఎత్తుకెళ్లిన దుండగులు