హైదరాబాద్ జంట నగరాల్లో మటన్, చికెన్ దుకాణాలపై పశు సంవర్ధక శాఖ దాడులు కొనసాగుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా ఆ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ బేరిబాబు నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిన బృందం తనిఖీలు చేస్తున్నారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, అస్మత్‌పేట, రాంనగర్, కూకట్‌పల్లి, నిజాంపేట తదితర ప్రాంతాల్లోని 13 దుకాణాల్లో విస్తృత తనిఖీలు చేశారు. ధరలు, నాణ్యత, సేకరణ వంటి అంశాలను పరిశీలించారు. లైసెన్సులు లేకుండా నడుపుతూ.. అధిక ధరలకు మాంసం విక్రయిస్తున్న ఆరు దుకాణాలను జప్తు చేశారు.
అస్మత్‌పేటలో స్పెన్సర్ మాల్‌లో మటన్ విక్రయాలు జరుపుతున్నారు. మాంసాన్ని శీతల ప్రదేశంలో నిల్వ చేయకుండా.. స్టిక్కర్లు వేసి అమ్ముతున్నారు. మిగిలిపోయిన మాంసాన్ని స్కిక్కర్ మార్చి మరునాడు విక్రయిస్తున్నట్లుగా అధికారులు నిర్ధారించారు. పైగా ప్రభుత్వ అనుమతి లేకుండా వినియోగదారుల నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ తీసుకుని మాంసం విక్రయిస్తున్న దృష్ట్యా.. మాల్‌ను జప్తు చేశారు.
మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని.. ఎక్కడైనా నిబంధనలు ఉల్లంఘించి విక్రయాలు చేపడితే ఫిర్యాదు చేయాలని డాక్టర్ బేరిబాబు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి : విద్యారంగానికి కరోనా- పరీక్షల నిర్వహణపై అయోమయం!