జలపాతం అందాలు చూసేందుకు వచ్చిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలంలోని ఏడుబావుల జలపాతం వద్ద చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా తల్లాడ, కల్లూరు మండలాలకు చెందిన 9 మంది యువకులు తవేరా వాహనంలో ఏడుబావుల జలపాతం వద్దకు వెళ్లారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం బొడిమల్లెకు చెందిన విష్ణువర్ధన్ రెడ్డి అనే యువకుడు స్నానం చేసేందుకు జలపాతంలోకి దిగి... సుడిగుండంలో చిక్కుకున్నాడు. రక్షించేందుకు తల్లాడ మండలం నారాయణపురానికి చెందిన అంజిరెడ్డి జలపాతంలోకి దిగాడు. ఈ లోపే ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.
మిగతా యువకులు వారికోసం గాలించగా ఆచూకీ లభ్యం కాలేదు. యువకులు గల్లంతైనట్టు అందిన సమాచారంతో గంగారం ఎస్సై రామారావు... సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని స్థానికుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. విష్ణవర్ధన్ రెడ్డి మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టానికి మృతదేహాన్ని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చీకటి పడటం వల్ల గాలింపు చర్యలు నిలిపివేశారు.