ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం లక్ష్యంగా మరోసారి రాకెట్ దాడులు జరిగాయి. అత్యధిక భద్రత కలిగిన గ్రీన్ జోన్‌లోని అమెరికా రాయబారి కార్యాలయం సమీపంలో భారీ పేలుళ్లు సంభవించాయి. ఈ మేరకు అమెరికా రక్షణ అధికారులు వెల్లడించారు.
అయితే ఎన్ని రాకెట్లతో దాడి చేశారు, ఎంత మంది గాయపడ్డారనే విషయంపై స్పష్టత లేదు. గతేడాది అక్టోబర్ నుంచి ఇరాక్‌లోని అమెరికా ఆస్తులపై దాడులు జరగడం ఇది 19వ సారని అగ్రరాజ్యం తెలిపింది.
ఘటనకు బాధ్యత వహిస్త్తున్నట్లు ఇప్పటి వరకూ ఎవరూ ప్రకటించలేదు. అయితే అగ్రరాజ్యం మాత్రం ఇరాన్ మద్దతుదారులైన ఉగ్రవాద సంస్థ హషీద్ అల్ షాబీ పనేనని ఆరోపించింది.
హెచ్చరించిన కాసేపట్లోనే
తొలుత హషీద్ ఉగ్రవాద సంస్థ... అమెరికా దళాలను దేశం విడిచి వెళ్లిపోవాలని లేదంటే ప్రతికార చర్యలు తప్పవని హెచ్చరించింది. ఇది జరిగిన కొద్ది సేపటిలోనే ఈ రాకెట్ దాడులు జరిగాయి.
గత డిసెంబర్లో ఇరాక్‌లోని కె1 సైనిక స్థావరంపై జరిగిన రాకెట్ దాడిలో ఓ అమెరికా కాంట్రాక్టర్ మరణించాడు. అప్పటినుంచి పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతికారంగా అమెరికా సైన్యం ఇరాన్ రెండో టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఇదీ చూడండి: రండి పులి బిడ్డలారా.. ప్రపంచాన్ని చుట్టేద్దాం!