ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య సంధి కుదుర్చేందుకు ఈజిప్ట్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం చివరి రోజైన ఈద్-ఉల్-ఫితర్ నాడు కూడా పరస్పర దాడులు కొనసాగాయి. దీంతో పాలస్తీనాలో పండగా వాతావరణమే కనిపించలేదు. హమాస్ ఉగ్రవాదులు వందల సంఖ్యలో రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగంపై సంధిచగా.. గాజాపై వైమానిక దాడులతో ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడ్డాయి.
కొన్ని రాకెట్లు టెల్ అవీవ్ సమీప ప్రాంతాలను తాకినా పెద్దగా ప్రాణ నష్టం ఏమీ సంభవించలేదని ఇజ్రాయెల్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఆ నగరంలో అరబ్బులు, యూదుల మధ్య పరస్పర దాడులు కొనసాగాయి. ఇజ్రాయెల్‌లోని ప్రధాన విమానాశ్రయాల్లో కొన్ని విమాన సర్వీసులు రద్దు కాగా మరికొన్నిటిని ఇతర చోట్లకు మళ్లించారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 103 మంది పాలస్తీనియన్లు మృతి చెందారని, వీరిలో 27 మంది చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. 580 మంది గాయపడ్డారు. 13 మంది తమ సభ్యులు చనిపోయారని హమాస్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఇజ్రాయెల్ ఏడుగురు చనిపోయారు. వారిలో ఒకరు సైనికుడని ఆ దేశ వర్గాలు పేర్కొన్నాయి.
90శాతం రాకెట్లను అడ్డుకున్న ఐరన్ డోమ్
అంతర్జాతీయ సమాజం తరఫున మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఈజిప్ట్ రంగంలోకి దిగింది. ఈజిప్ట్ అధికారులు తొలుత గాజాలో హమాస్ నేతలను కలిసి చర్చలు జరిపారు. ఆ తర్వాత టెల్ అవీవ్‌కు వెళ్లి ఇజ్రాయెల్ నేతలతోనూ భేటీ అయ్యారు. ఇరువైపుల నుంచి సంధి యత్నాలకు సానుకూల స్పందన రాలేదని సమాచారం. రాజీ యత్నాలు ఒకవైపు జరుగుతుండగానే గాజా వైపు నుంచి ఉగ్రవాదులు మూకుమ్మడిగా ఇజ్రాయెల్ పైకి వందల సంఖ్యలో రాకెట్లను ప్రయోగించారు. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్, అణురియాక్టర్లున్న డిమోనా, జరూసలెం లక్ష్యంగా ఉగ్రవాదులు రాకెట్ దాడులకు పాల్పడ్డారు. నష్టం ఏ మేరకు జరిగిందన్నది తెలియరాలేదు. వీటికి ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ వైమానికి దాడులు జరిపింది.
ఐరన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సందర్శించారు. హమాస్ ప్రయోగించిన 1200 రాకెట్లలో 90 శాతాన్ని విజయవంతంగా ఐరన్ డోమ్ అడ్డుకుందని తెలిపారు.
రంగంలోకి రిజర్వుడు సైనికులు
హమాస్ ఉగ్రవాదులతో ఘర్షణ తీవ్రతరం కావడం వల్ల ఇజ్రాయెల్.. 9 వేల మంది రిజర్వుడు సైనికులను రంగంలోకి దింపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న విచక్షణారహిత దాడులను ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియా గుటెరస్ ఖండించారు. గాజాలోని పౌర ప్రాంతాల నుంచి రాకెట్లను సంధించడాన్ని ఆయన గర్హించారు. సంయమనం పాటించాలని ఇజ్రాయెల్‌నూ కోరారు. ఉద్రిక్తతల నివారణకు సీనియర్ దౌత్యవేత్తను పంపించనున్నట్లు అమెరికా విదేశీవ్యవహారాల మంత్రి బ్లింకెన్ తెలిపారు.
లెబనాన్ నుంచి ఇజ్రాయెల్‌పై దాడులు!
దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ వైపు మూడు రాకెట్లు దూసుకెళ్లినట్లు లెబనీస్ సైన్యాధికారులు తెలిపారు. అయితే ఈ దాడి ఎవరు చేశారో.. ఆ రాకెట్లు ఏ ప్రాంతంలో పడ్డాయో స్పష్టంగా తెలియదని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం- స్థానికులకు హెచ్చరిక