కరోనా సంక్షోభం వేళ మద్యం అమ్మకాలపై దుబాయి యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ మద్యం సరఫరాను అడ్డుకోవడం సహా లాక్డౌన్ కారణంగా ఏర్పడిన ఆదాయ లోటు పూడ్చుకోవడానికి మద్యాన్ని ఇళ్లకే సరఫరా చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన మారిటైమ్ అండ్ మర్కంటైల్ ఇంటర్నేషనల్(ఎంఎంఐ), ఆఫ్రికన్ ఈస్టర్న్ సంస్థలు జట్టుకట్టాయి.
ఈ రెండు సంస్థలు కలిసి 'లీగల్హోండెలివరీ.కామ్' అనే వెబ్‌సైట్‌ను రూపొందించాయి. ఇలాంటి సమయంలో ఈ సేవలు అవసరమని అంటున్నాయి.
ఇవి ఉంటేనే మద్యం
దుబాయ్‌లో ఉన్న పర్యటకులు తమ పాస్‌పోర్టులను ఆధారంగా చూపి మద్యం కొనుగోలు చేయవచ్చని అధికారులు వెల్లడించారు. స్థానికులకు మద్యం సరఫరా చేయాలంటే మాత్రం పోలీసులు ఇచ్చే ఆల్కహాల్ లైసెన్స్ ఉండాలని స్పష్టం చేశారు. 21 ఏళ్లు నిండిన ముస్లిమేతరులు మాత్రమే లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఆశ్చర్యమే కదా!
వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడానికి దుబాయ్ అంతటా లాక్డౌన్ విధించారు. బార్లు, హోటళ్లు పూర్తిగా మూసేశారు. దీంతో అక్కడి ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది.
దుబాయ్ లగ్జరీ హోటళ్ల పరిశ్రమ తీవ్రంగా దెబ్బతిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇది ఆల్కహాల్ వినియోగంపై ప్రభావం చూపించిందని అభిప్రాయపడుతున్నారు. షార్జా వంటి పక్క రాష్ట్రాలతో పాటు, ఇరాన్, కువైట్, సౌదీ అరేబియా దేశాల్లో మద్యం అమ్మకంపై నిషేధం ఉన్నప్పటికీ... దుబాయ్‌లో హోం డెలివరీ ప్రారంభించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
కట్టుబాట్లకు చెల్లు!
సామాజిక కట్టుబాట్లను క్రమక్రమంగా తొలగిస్తున్న దుబాయ్.. తాజాగా మద్యం అమ్మకాలపై ఈ నిర్ణయం ప్రకటించింది. దుబాయ్‌కు వచ్చే పర్యటకులు మద్యం కొనుగోలు చేసేలా గతేడాది నిబంధనలు సరళతరం చేసింది. రంజాన్ మాసంలోనూ పగటి పూట మద్యం అమ్మకాలు చేపట్టేలా 2016లో నిర్ణయం తీసుకుంది.
ఇదీ చదవండి: 'మందుబాబులు మారేందుకు ఇదే అద్భుత అవకాశం'