XI Jinping G20 India : భారత్ వేదికగా సెప్టెంబర్ 9,10 తేదీల్లో జరిగే జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జిన్‌పింగ్‌కు బదులు చైనా ప్రధానమంత్రి లీ చియాంగ్ దిల్లీకి వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. గత ఏడాది నవంబర్‌లో ఇండోనేషియాలోని బాలీ వేదికగా జరిగిన జీ20 దేశాధినేతల సదస్సుకు జిన్‌పింగ్ హాజరయ్యారు. ఆ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో జిన్‌పింగ్ భేటీ అయ్యారు.
ఇటీవల చైనా-అమెరికా మధ్య సంబంధాలు దెబ్బతినడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీ వేదికగా బైడెన్-జిన్‌పింగ్ మధ్య సమావేశం జరగవచ్చని అంతా భావించారు. ఐతే దిల్లీకి బైడెన్ వస్తున్నా జిన్‌పింగ్ మాత్రం రావడం లేదని సమాచారం. గతవారం దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో జిన్‌పింగ్ పాల్గొన్నారు. సరిహద్దు వివాదాల కారణంగా భారత్-చైనా మధ్య కూడా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడం వల్ల బ్రిక్స్ సదస్సులోనూ జిన్‌పింగ్, మోదీ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగలేదు. ఐతే కాసేపు మాట్లాడుకున్న మోదీ, జిన్‌పింగ్ సరిహద్దుల్లో ఉద్రిక్తలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో దిల్లీ జీ20 సదస్సుకు జిన్‌పింగ్ డుమ్మా కొట్టనుండటం గమనార్హం.
అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు దిల్లీలోని జీ20 సదస్సుకు రావడం లేదని ఇప్పటికే వెల్లడించారు. తన బదులు విదేశాంగ మంత్రి సెర్గి లావ్రోవ్ సదస్సుకు వస్తారని ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. జీ20 మంత్రుల స్థాయి పలు సమావేశాల్లోని సంయుక్త ప్రకటనల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడికి నిరసనగా ఉన్న అంశాలను ఇప్పటికే రష్యా, చైనా వ్యతిరేకించాయి.
2020 జూన్‌లో తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో చైనా, భారత్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. వీటిని తగ్గించడంలో భాగంగా రెండు దేశాల మధ్య సైనిక, దౌత్యస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇది చాలదన్నట్టు భారత్ ఒకవైపు G20 సదస్సుకు ఏర్పాట్లు చేస్తుంటే.. చైనా సరికొత్త మ్యాప్‌తో వివాదం మొదలుపెట్టింది. సరిహద్దుల్లోని వివాదాస్పద ప్రాంతాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్, తైవాన్, దక్షిణ చైనా సముద్రాలను తమ దేశంలోని భూభాగాలుగా అందులో పేర్కొంది. దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
China Construction In Aksai Chin : కయ్యాలమారి కవ్వింపు.. అక్సాయ్ చిన్‌లో చైనా భారీ నిర్మాణాలు