UN chief Russia Ukraine visit: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ.. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శాంతి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. ఏప్రిల్ 26న గుటెరస్ మాస్కోకు వెళ్లనున్నారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్తో విందులో పాల్గొననున్నారు. అనంతరం, పుతిన్‌ను కలవనున్నారు. రష్యా పర్యటన అనంతరం ఉక్రెయిన్‌కు వెళ్తారు గుటెరస్. ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబాతో సమావేశమవుతారు. ఏప్రిల్ 28న జెలెన్స్కీతో భేటీ అవుతారని ఐరాస ప్రతినిధి తెలిపారు. ఉక్రెయిన్ ప్రజలకు మానవతా సాయం అందిస్తున్న వివిధ ఐరాస విభాగాల అధికారులతోనూ గుటెరస్ సమావేశం నిర్వహించనున్నారు. యుద్ధం ప్రారంభమై రెండు నెలలు గడిచిన నేపథ్యంలో ఈ పర్యటన జరగనుండటం గమనార్హం.
Guterres meet with Putin Zelenskyy: పర్యటన విషయమై ఇదివరకే పుతిన్, జెలెన్స్కీలకు గుటెరస్ లేఖలు రాశారు. ఉక్రెయిన్‌లో శాంతి కోసం చర్చలు జరపాలని పిలుపునిచ్చారు. కాల్పుల విరమణ కోసం వివిధ పక్షాలు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంపై విచారం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన ప్రజలను తరలించేందుకు వీలుగా యుద్ధానికి విరామం ఇవ్వాలని సూచించారు. 'ఉక్రెయిన్‌లో 1.2కోట్ల మందికి మానవతా సాయం అవసరం ఉంది. ఇందులో మూడోవంతు ప్రజలు డొనెట్స్క్, లుహాన్స్క్, మేరియుపోల్, ఖేర్సన్ వంటి నగరాల్లోనే ఉన్నారు. మానవతా సాయం కోరుకునే వారి సంఖ్య కోటి 57 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌లో ప్రస్తుతం ఉన్న ప్రజల్లో ఈ సంఖ్య 40శాతానికి సమానం. ఇలాంటి చావు బతుకుల మధ్య ఉన్న ప్రజల కోసం రష్యా, ఉక్రెయిన్లు తుపాకులు వదిలాలని పిలుపునిస్తున్నా' అని ఆందోళన వ్యక్తం చేశారు గుటెరస్.
మరోవైపు, ఉక్రెయిన్‌లోని మేరియుపొల్‌లో రష్యా సేనలు మారణహోమం సృష్టిస్తున్నాయి. వేల సంఖ్యలో ఉక్రెయిన్ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మేరియుపొల్ సమీపంలో తాజాగా వెలుగు చూసిన సామూహిక సమాధులు ఆ వాదనలకు బలం చేకూర్చుతున్నాయి. ఈ కథనం కోసం లింక్‌పై క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: 'భారత్‌కు విలువ ఇస్తాం.. ఆ విషయంలో మాత్రం ప్రోత్సహించలేం'