Ukraine Patriot Missile : రాబోయే కొద్ది రోజుల్లో ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షిపణి దాడులను అడ్డుకోగల పేట్రియాట్ రక్షణ వ్యవస్థను ఉక్రెయిన్‌కు ఇచ్చేందుకు అమెరికా సిద్ధపడటం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కీవ్‌కు 'పేట్రియాట్' సరఫరాకు అమెరికా నిర్ణయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రష్యా ఈ పరిణామం యుద్ధాన్ని ఇంకా జఠిలం చేస్తుందని హెచ్చరించింది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం 10 లక్షల మందిగల రష్యా సైన్యాన్ని 15 లక్షలకు పెంచాల్సిన అవసరం చాలా ఉందని ఆ దేశ రక్షణమంత్రి సెర్గే షొయిగు బుధవారం పేర్కొన్నారు. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ యుద్ధం మొదలైన తరువాత తొలిసారి విదేశీ పర్యటనలో భాగంగా అమెరికాలో అడుగుపెట్టారు. తన పర్యటనలో భాగంగా ఆయన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు. అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించడం సహా.. అక్కడి కీలక సభ్యులతో సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ విషయాలను స్వయంగా ఆయనే వెల్లడించారు.
ఇటీవలే శ్వేతసౌధం 1.8 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహాయాన్ని ధ్రువీకరించింది. అమెరికా ప్రకటించిన ప్యాకేజీలో పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా ఉంది. రష్యా దాడుల నుంచి ఉక్రెయిన్ మౌలిక వసతులను కాపాడుకొనేందుకు దీనిని వినియోగించనున్నారు. దీనిపై శ్వేతసౌధం స్పందిస్తూ.. ఉక్రెయిన్ దళాలకు వేరే దేశంలో పేట్రియాట్ క్షిపణుల వినియోగంపై శిక్షణ ఇస్తామని పేర్కొంది. 2023 నాటికి దాదాపు 40 బిలియన్ డాలర్లకు పైగా సాయాన్ని ఉక్రెయిన్‌కు అందించే బిల్లును అమెరికా సిద్ధం చేస్తోంది. యుద్ధం మొదలైన నాటి నుంచి మరేదేశం అందించని స్థాయిలో ఉక్రెయిన్‌కు అమెరికా సాయం చేసింది. జూన్ నుంచి నవంబరు వరకు ఒక్క అమెరికానే 18.51 బిలియన్ డాలర్లు అందించింది.
స్మార్ట్ బాంబులుగా మార్చే కిట్‌లు కూడా..
పేట్రియాట్ క్షిపణులతోపాటు ప్రస్తుతం ఉన్న డంబ్ బాంబ్‌లను స్మార్ట్ బాంబులుగా మార్చే కిట్‌లను కూడా ఉక్రెయిన్‌కు అందించనున్నట్లు అమెరికా అధికారులు పేర్కొన్నారు. ఇటువంటివి ఎన్ని ఉక్రెయిన్‌కు పంపించనున్నారో వెల్లడించలేదు. వీటి ఆధారంగా రష్యా సైనిక స్థావరాలపై కచ్చితత్వంతో ఉక్రయిన్ దాడులు చేసే అవకాశాలు మరింత పెరుగుతాయి. కానీ, వీటిని వినియోగించాలంటే ఫైటర్ జెట్ విమానాలు అవసరం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఉక్రెయిన్ వద్ద ఉన్న సోవియట్ కాలం నాటి మిగ్ విమానాలను వాడుకొనే అవకాశం ఉంది.
తాజా దాడిలో అయిదుగురి మృతి..
రష్యా బుధవారం జరిపిన క్షిపణి దాడిలో అయిదుగురు మృతి చెందారని, 17 మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధ్యక్ష భవనం అధికారులు వెల్లడించారు. తమ భూభాగంపై రష్యా అయిదు క్షిపణులను ప్రయోగించి, 16 వైమానిక దాడులకు పాల్పడిందని తెలిపారు.
సైన్యాన్ని 15 లక్షలకు పెంచాలి..
ప్రస్తుతం 10 లక్షలుగా ఉన్న దేశ సైనికుల సంఖ్యను 15 లక్షలకు పెంచాల్సిన అవసరం చాలా ఉందని రష్యా రక్షణ మంత్రి సెర్గే షొయిగు బుధవారం పేర్కొన్నారు. అయితే ఇందుకోసం గడువును ఆయన వెల్లడించలేదు. అంతేకాకుండా ఫిన్లాండ్, స్వీడన్ దేశాలు నాటోలో చేరేందుకు యోచిస్తున్న నేపథ్యంలో దేశ పశ్చిమ ప్రాంతంలో కొత్త సైనిక స్థావరాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, మరికొంతమంది ఉన్నతస్థాయి సైనికాధికారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఉక్రెయిన్‌కు అమెరికా ఆయుధాలతో యుద్ధం తీవ్రతరమే..
ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాలను అమెరికా పెంచినట్లైతే ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం చాలా తీవ్రతరమవుతుందని రష్యా బుధవారం హెచ్చరించింది. ఈ పరిస్థితి ఉక్రెయిన్‌కు మంచిదికాదని హితవు పలికింది. ఈ మేరకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ విలేకరులతో పేర్కొన్నారు. జెలెన్‌స్కీ అమెరికా పర్యటన నేపథ్యంలో రష్యా భద్రతా మండలి ఉపాధ్యక్షుడు దిమిత్రి మెద్వెదేవ్ బుధవారం చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సంక్షోభం సహా పలు అంశాలపై చర్చలు జరిపినట్లు ఆయన వెల్లడించారు.
ఉక్రెయిన్‌కు ఇక 'పేట్రియాట్'లు..
ఉక్రెయిన్‌కు 1.85 బిలియన్ డాలర్ల విలువైన సైనిక సహకారం అందించనున్నట్లు అమెరికా బుధవారం ప్రకటించింది. అలాగే పేట్రియాట్ క్షిపణి రక్షణ వ్యవస్థను అందిస్తామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మరికొద్ది గంటల్లో తమ దేశంలోకి అడుగుపెడతారనగా అమెరికా ఈ ప్రకటన చేసింది. ఈ ప్యాకేజీలో భాగంగా బిలియన్ డాలర్ల విలువైన సాయంలో పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ సహా ఆయుధాలు, యుద్ధ సామగ్రిని పెంటగాన్ నిల్వల నుంచి ఉక్రెయిన్‌కు అందిస్తారు. అలాగే 850 మిలియన్ డాలర్లను ఉక్రెయిన్ భద్రత సహాయ కార్యక్రమాలకు వినియోగిస్తారు.