Ukraine Crisis: ఉక్రెయిన్‌లోని మేరియుపొల్ నగరంలోని ఓ ఉక్కు కర్మాగారంపై రష్యా సైన్యం ఆదివారం గగనతల దాడులకు దిగింది. ఆ ప్రాంగణంలో ఉక్రెయిన్ సైనికులతో పాటు పలువురు ప్రజలు తలదాచుకోవడం వల్ల కొన్ని వారాలుగా దానిపై పట్టు సాధించడానికి రష్యా ప్రయత్నిస్తుంది. ఆ కర్మాగారాన్ని చేజిక్కించుకుంటే ఇక ఆ నగరమంతా తమకు దక్కినట్లేనని రష్యా భావిస్తోంది. యుద్ధం మొదలై సరిగ్గా రెండు నెలలు పూర్తయిన తరుణంలో కీవ్‌లో ఒకపక్క అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌లతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సమావేశం జరగనుండగా మరోపక్క ఈ కర్మాగారంపై దాడులు చోటు చేసుకున్నాయి. 'పునరుత్థానం ఉంటుంది. మరణాన్ని జీవనం జయిస్తుంది. అబద్ధాన్ని నిజం ఓడిస్తుంది. దుష్టశక్తికి శిక్ష తప్పదు. ఈ వాస్తవాలను రష్యా మరోసారి గుర్తెరగాలి. కాకపోతే దానికి కొంత సమయం పట్టవచ్చు' అని జెలెన్‌స్కీ చెప్పారు. కీవ్‌లోని సబ్‌వే స్టేషన్లో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశం తరఫున పోరాడుతున్నవారి కోసం ఆదివారం ఉక్రెయిన్‌లో ఈస్టర్ ప్రార్థనలు నిర్వహించారు. దీనిలో పలువురు సైనికులూ పాల్గొన్నారు.
రష్యా కమాండ్ శిబిరం ధ్వంసం: ఉక్రెయిన్‌లోని లుహాన్స్క్, దొనెట్స్క్ ప్రాంతాల్లో రష్యా సైన్యం దాడులు ముమ్మరమయ్యాయి. దీనిలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఖేర్సన్‌లో రష్యాకు చెందిన కమాండ్ శిబిరాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. దీనిలో ఇద్దరు జనరళ్లు చనిపోయారనీ, మరొకరు తీవ్రంగా గాయపడ్డారనీ తెలుస్తోంది. దీనిపై రష్యా సైన్యం స్పందించలేదు. ఈ వార్తలు వాస్తవమైతే మొత్తం 9 మంది సైనిక జనరళ్లను రష్యా కోల్పోయినట్లవుతుంది. దాడి సమయంలో దాదాపు 50 మంది సీనియర్ అధికారులు అక్కడ ఉన్నారు. ఉక్రెయిన్‌లో పేలుడు పదార్థాల కర్మాగారాన్ని, అనేక ఆయుధాగారాలను, వందలకొద్దీ ఇతర లక్ష్యాలను క్షిపణులతో పేల్చివేసినట్లు రష్యా సైన్యం తెలిపింది. ఉక్రెయిన్ సైన్యానికి చెందిన 26 లక్ష్యాలను పేల్చివేసినట్లు వివరించింది.
బ్రిటన్ నుంచి మరింత సాయం: రక్షణ పరికరాల రూపంలో ఉక్రెయిన్‌కు మరింత సాయం అందించనున్నట్లు బ్రిటన్ ప్రకటించింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఫోన్లో మాట్లాడి, ఈ హామీ ఇచ్చారు. డ్రోన్లు, సురక్షితంగా సైనికుల కదలికలకు ఉపయోగపడే వాహనాలను సమకూరుస్తామని చెప్పారు. రష్యాపై తాజాగా విధించిన ఆంక్షల గురించి వివరించి, కీవ్‌లో తమ దౌత్య కార్యాలయాన్ని కొద్దిరోజుల్లోనే తెరిచి, సంఘీభావంగా నిలవబోతున్నామని తెలిపారు. ఉక్రెయిన్‌లో చర్యలకు రష్యా బాధ్యత వహించాలని, దానికి తగ్గ ఆధారాలు సేకరించడంలో బ్రిటన్ సహకరిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: మెక్రాన్కే మరోసారి ఫ్రాన్స్ అధ్యక్ష పీఠం