Shinzo abe state funeral : మాజీ ప్రధాని షింజో అబెకు జపాన్ ప్రభుత్వం అధికారిక వీడ్కోలు పలకనుంది. సెప్టెంబర్ 27న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. దీనికి భారత ప్రధాని హాజరుకావాలని యోచిస్తున్నట్లు బుధవారం జపాన్ మీడియా వెల్లడించింది. టోక్యోలోని కిటనోమారు నేషనల్ గార్డెన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. అనంతరం మోదీ జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదతో సమావేశమయ్యే అవకాశం ఉందని పేర్కొంది.
జపాన్.. భారత్‌కు మిత్రదేశం. అబె అధికారంలో ఉన్న సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలు గణనీయంగా మెరుగయ్యాయి. 2018లో మోదీ జపాన్‌కు వెళ్లినప్పుడు..అబె మన ప్రధానిని తన పూర్వీకుల నివాసానికి తీసుకెళ్లారు. ఈ ఆహ్వానం ఇద్దరి నేతల మధ్య ఉన్న ఆత్మీయబంధాన్ని చాటింది. అలాగే క్వాడ్ సదస్సులో భాగంగా ఈ ఏడాది మేలో మోదీ మరోసారి ఆ దేశంలో పర్యటించారు. ఆ సందర్భంగా అబెను కలుసుకున్నారు. అప్పటికే అబె ప్రధాని పీఠం దిగి రెండు సంవత్సరాలయింది.
జపాన్ చరిత్రలో అత్యంత సుదీర్ఘకాలం ప్రధానిగా పనిచేసిన అబె.. గత నెల హత్యకు గురయ్యారు. ఆయన నరా నగరంలోని ఓ వీధిలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. దీంతో అబె ఛాతీ పట్టుకుని వేదికపైనే కుప్పకూలారు. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు కూడా ముగిశాయి. కానీ అక్కడి ప్రభుత్వం సెప్టెంబర్ 27న అధికారిక వీడ్కోలు పలకాలని నిర్ణయించింది. రెండోప్రపంచ యుద్ధం తర్వాత జపాన్ నిర్వహిస్తోన్న రెండో అధికారిక వీడ్కోలు కార్యక్రమమిది. అంతకుముందు 1967లో మాజీ ప్రధాని షిగెరు యోషిదాకు ఈ గౌరవం దక్కింది.
ఇవీ చదవండి: ఆ దేశ ప్రధానిని సస్పెండ్ చేసిన కోర్టు, కారణమిదే
రాజాసింగ్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ఫైర్, మోదీకి స్పెషల్ డిమాండ్