రణరంగంలో తమను ఓడించాలని చూసేవారికి ఒక విషయం అర్థం కావడం లేదని, ఆధునిక యుగంలో తమ దేశాన్ని ఎదుర్కోవడం సులువు కాదని అమెరికా, జర్మనీలను ఉద్దేశించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హెచ్చరించారు. స్టాలిన్ గ్రాడ్ యుద్ధం జరిగి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. ఆనాటి పోరాటంలో భాగమైన వారికి పుతిన్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్టాలిన్ గ్రాడ్ వద్ద రష్యా.. 91 వేలమంది జర్మన్ బలగాలను బంధించింది. ఇది రెండో ప్రపంచ యుద్ధగతిని మార్చింది. ఈ స్టాలిన్ గ్రాడ్‌ను ప్రస్తుతం వొల్గొగ్రాడ్‌గా వ్యవహరిస్తున్నారు.
అమెరికా 30 ఎం1 అబ్రామ్స్ ట్యాంకులు, జర్మనీ 14 లెపర్డ్ 2 యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు అందిస్తుండటంపై పుతిన్ మండిపడ్డారు. 80 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతమవుతోందని జర్మనీ ట్యాంకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "మేం మా ట్యాంకులను వారి సరిహద్దుల్లోకి పంపడం లేదు. కానీ, వారిని ఎదుర్కొనే మార్గాలున్నాయి. యుద్ధం ఆయుధాలకే పరిమితం కాదని వారు అర్థం చేసుకోవాలి. దురదృష్టవశాత్తూ ఆధునిక ముసుగులో నాజీ భావజాలాన్ని చూస్తున్నాం. అది మరోసారి మన దేశ భద్రతకు ముప్పుగా పరిణమించింది. పశ్చిమ దేశాల దురాక్రమణను కలిసికట్టుగా ఎదిరించాలి. జర్మనీ ట్యాంకులతో రష్యాకు ముప్పు ఉందనేది నమ్మలేని నిజం. అయితే, రష్యా తన భద్రతకు ప్రమాదంగా మారిన వాటికి గతంలో తగిన సమాధానం కూడా చెప్పింది" అని పశ్చిమ దేశాలు మరీ ముఖ్యంగా జర్మనీని ఉద్దేశించి పుతిన్ పేర్కొన్నారు.
జెలెన్‌స్కీతో ఈయూ నేతల భేటీ..
యూరోపియన్ యూనియన్ (ఈయూ)కు చెందిన పలువురు అధికారులు శుక్రవారం ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. వీరిలో యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు ఉర్సులా వాన్ డెర్ లెయెన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఛార్లెస్ మైఖెల్, 15 మంది యూరోపియన్ కమిషనర్లు ఉన్నారు. రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్‌కు సహకరిస్తామని తెలిపేందుకు, అలాగే ఈయూలోనూ, నాటోలోను ఆ దేశం చేరికపై వారు చర్చించారు. మరోపక్క తమ దేశానికి చెందిన పాత తరం లెపర్డ్ 1 యుద్ధ ట్యాంకులను కూడా ఉక్రెయిన్‌కు అందించాలని జర్మనీ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ దేశ ప్రభుత్వ అధికార ప్రతినిధి స్టెఫెన్ హెబెస్ట్రిట్ స్పష్టం చేశారు. అయితే ఎన్ని ట్యాంకులను పంపబోయేది ఆయన వివరించలేదు.
లిబియా, సూడాన్‌ల నుంచి వాగ్నర్ గ్రూప్ బహిష్కరణపై అమెరికా దృష్టి..
రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సన్నిహిత సంబంధాలు గల వాగ్నర్ గ్రూప్‌ను కల్లోలిత లిబియా, సూడాన్‌ల నుంచి బహిష్కరించేందుకు అమెరికా తన చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈజిప్టు, యూఏఈలతో సంప్రదింపులు జరుపుతోంది. తద్వారా సూడాన్, లిబియాల్లోని సైనిక నేతలపై ఆ గ్రూపుతో సంబంధాలు తెంచుకునేలా ఒత్తిడి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇటీవల కొన్ని నెలల క్రితమే వాగ్నర్ గ్రూప్‌పై అమెరికా పలు ఆంక్షలను విధించింది. కిరాయి సైనికులతో నడిచే ఈ గ్రూపు రష్యా ఒలిగార్క్ యెవ్‌జెనీ ప్రిగోఝిన్‌కు చెందినది. ఆయన పుతిన్‌కు అత్యంత సన్నిహితుడు.