russia hits in lviv city: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు మరింత తీవ్రమయ్యాయి. ఇప్పటివరకూ ప్రధాన నగరాలే లక్ష్యంగా విరుచుకుపడిన మాస్కో బలగాలు..ఇప్పుడు వ్యూహం మార్చి చిన్న నగరాలపై దాడులకు దిగుతున్నాయి. పోలాండ్ సరిహద్దుకు సమీపంలోని.. లవీవ్ నగరంపై పుతిన్ సేనలు.. ఎడతెగని రాకెట్ దాడులు చేశాయి. నాలుగు రాకెట్లు లవీవ్‌ను తాకినట్లు తెలిపిన ఉక్రెయిన్ అధికారులు రెండు రాకెట్లు ఇంధన డిపోను తాకగా.. మరో రెండు రాకెట్లు.. సైనిక స్థావరాన్ని తాకినట్లు తెలిపారు. రష్యా దాడిలో పాఠశాల భవనం కూడా ధ్వంసం అయ్యిందని వెల్లడించారు. దాడుల్లో.. ఐదుగురు గాయపడ్డారని వివరించారు. నగరంలో శక్తివంతమైన పేలుళ్లు సంభవిస్తున్నాయన్న లవీవ్ గవర్నర్ మాక్సిమ్ కోజిట్‌స్కీ, ప్రజలెవ్వరూ బయట తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. రాకెట్ దాడుల ప్రదేశంలో గూఢచర్యం చేశాడనే ఆరోపణలతో ఓ వ్యక్తిని ఉక్రెయిన్ బలగాలు అరెస్ట్ చేశాయి.
మరోవైపు రష్యా సేనలు తమ ఇంధన స్థావరాలు, ఆహార నిల్వలను ధ్వంసం చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆరోపించారు. రష్యాని ఎదుర్కొనేందుకు..మరిన్నీ యుద్ధ ట్యాంకులు, విమానాలు, క్షిపణులను అందించాలని కోరారు.రేవు పట్టణం మరియుపోల్‌ను దాదాపుగా నేలమట్టం చేసిన రష్యా దళాలు చెర్నిహివ్‌పై అదే తీవ్రతతో విరుచుకు పడుతున్నాయి. రాజధాని కీవ్, ఖర్కివ్ సహా ప్రధాన నగరాల్లో దాడుల తీవ్రత పెరిగినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. కీవ్‌లో కీలక బ్రిడ్జిని రష్యా ధ్వంసం చేయడంతో అక్కడ జీవనం దుర్లభంగా మారింది. చెర్నోబిల్ అణు కర్మాగారం ఉన్న స్లావుటిచ్ ప్రాంతాన్నిరష్యా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ క్రమంలో జరిగిన భీకర పోరులో.. ముగ్గురు ఉక్రెయిన్ పౌరులు మరణించారు. ఇటు డాన్‌బాస్ ప్రాంతానికి పూర్తిగా విమోచనం కల్పించడంపై దృష్టి సారిస్తామని ప్రకటించిన రష్యా సైన్యం ఆ ప్రాంతానికి తన బలగాలను చేరవేస్తోంది.
ఉక్రెయిన్ తీవ్ర ప్రతిఘటనతో.. రష్యా స్వాధీనం చేసుకున్న ప్రాంతాలపై క్రమంగా పట్టు కోల్పోతోంది. యుద్ధం ప్రారంభంలో మాస్కో బలగాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రకటించింది. ధ్వంసమైన భవనాల మధ్య ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ఉన్న చిత్రాలను ఆ దేశ రక్షణశాఖ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఈ చిత్రాల్లో రష్యా సైనికులు తమ ఆయుధ సంపత్తిని వదిలి వెళ్లినట్లు కనిపిస్తోంది. రాజధాని కీవ్‌కు పశ్చిమాన 50 కిలోమీటర్ల దూరంలోని యస్నోహోర్దొకా గ్రామంతో పాటు.. ఖెర్సన్ నుంచి కూడా రష్యా దళాలను ఉక్రెయిన్ సైనికులు తరిమేసినట్టు అధికారులు తెలిపారు. ఉత్తర ఉక్రెయిన్‌లో.. మార్చి 1న రష్యా దళాలు స్వాధీనం చేసుకున్న ట్రోస్టియానెట్స్ ప్రాంతాన్ని కూడా జెలెన్ స్కీ బలగాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే మరియుపోల్‌తో పాటు వివిధ నగరాలను ధ్వంసం చేసిన రష్యా.. ఇప్పుడు లవీవ్‌పైనా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంపై అత్యంత ప్రమాదకర క్షిపణులను ప్రయోగిస్తోంది. తాజాగా లవీవ్‌పై క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు మాస్కో రక్షణ శాఖ స్వయంగా వెల్లడించింది. లవీవ్ సమీపం నుంచి ఉక్రెయిన్ దళాలు ఉపయోగిస్తున్న ఇంధన డిపోను రష్యా సుదూర క్షిపణులతో ధ్వంసం చేసింది. యాంటీ-ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్‌లు, రాడార్ స్టేషన్‌లు, ట్యాంకులను రిపేర్ చేసేందుకు వినియోగిస్తున్న ఓ ప్లాంట్‌పై దాడి చేసేందుకు క్రూయిజ్ క్షిపణులను ఉపయోగించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌కు అందే మానవతా సాయాన్ని కూడా రష్యా అడ్డుకుంటున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చేరే చమురు, ఆహార సరఫరాలను రష్యా ధ్వంసం చేయడం ప్రారంభించిందని ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రి వాడిమ్ డెనిసెంకో పేర్కొన్నారు. ఉక్రెయిన్ సరిహద్దుకు మాస్కో కొత్త దళాలను దించడం ప్రారంభించిందని కూడా ఆ తెలిపారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరపాలని క్రైస్తవ మత ప్రబోధకుడు పోప్ ఫ్రాన్సిస్ పిలుపునిచ్చారు. రోమ్‌లోని సెయింట్ పీటర్ స్క్వార్ వద్ద పోప్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మానవత్వం.. తప్పకుండా యుద్ధానికి ముగింపు పలకాలని, లేకుంటే యుద్ధమే మానవత్వానికి ముగింపు పలుకుతుందని హెచ్చరించారు. యుద్ధాన్ని ముగించే దశకు చేరుకున్నామని మానవత్వం అర్ధం చేసుకోవాలని సూచించారు. క్రూరమైన, మతిలేని ఈ యుద్ధం కొనసాగితే, అది అందరికీ ఓటమి అని అన్నారు. యుద్ధం మానవుడిని చరిత్ర నుంచి తొలగించకముందే.. చరిత్ర నుంచి యుద్ధాన్ని తొలగించాలని పోప్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: పుతిన్‌కు ఉద్వాసన తప్పదా? మరో గోర్బచెవ్ అవుతారా?