PM Modi in Germany: రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని.. అందరూ నష్టపోతారని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ శాంతి పక్షానే నిలుస్తోందని మోదీ ఉద్ఘాటించారు. ఉక్రెయిన్ సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని.. ఆహార ధాన్యాలు, ఎరువుల కొరత కారణంగా ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలపై అధికంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై దాడి చేయడం ద్వారా రష్యా ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను రష్యా ఉల్లంఘించిందని జర్మనీ ఛాన్సలర్ స్కోల్జ్ అన్నారు. జర్మనీలో జరిగే జీ-7 సదస్సుకు ప్రధాని మోదీని కూడా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.
మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. రాజధాని బెర్లిన్‌లో ఆ దేశ ఛాన్సలర్ ఒలాఫ్ స్కోల్జ్‌తో భేటీ అయ్యారు. వాణిజ్యానికి ప్రోత్సాహకాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. 6వ ఇండియా- జర్మనీ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో ఒలాఫ్ స్కోల్జ్‌తో కలిసి పాల్గొన్నారు మోదీ. ప్రధానితో పాటు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ కూడా పాల్గొన్నారు.
2021 డిసెంబర్‌లో ఛాన్సలర్ స్కోల్జ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. మా వ్యూహాత్మక భాగస్వామితో ఉన్నత స్థాయి సమావేశం తర్వాత సంబంధాలు మరింత పెరుగుతాయి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ప్రధాని అయిన తర్వాత మోదీ జర్మనీలో పర్యటించడం ఇది ఐదోసారి. అంతకుముందు ఏప్రిల్ 2018, జులై 2017, మే 2017, ఏప్రిల్ 2015లో జర్మనీని సందర్శించారు.
మూడు రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఆత్మీయ ఆహ్వానం లభించింది. ఈ క్రమంలో కొందరు చిన్నారులు ఆకట్టుకునే బహుమతులు ఇచ్చి, ఆయన్ను మెప్పించారు. ఒక పాప తాను గీసిన చిత్రాన్ని బహూకరించగా.. ఓ బాలుడు దేశభక్తి గీతం ఆలపించాడు.
ఈ రోజు ఉదయం బెర్లిన్‌లోని అడ్లోన్ కెంపిన్‌స్కీ హోటల్ వద్ద ప్రవాస భారతీయులు మోదీని ఆహ్వానిస్తూ.. 'వందేమాతరం', 'భారత్ మాతాకీ జై' అంటూ నినాదాలు చేశారు. ఆ సమయంలో ఓ పాప మోదీపై చిత్రాన్ని గీసి, ఆయనకే అందించింది. దానిలో తనను తాను చూసుకున్న ప్రధాని.. ఆశ్చర్యానికి గురయ్యారు. దీనిని గీయడానికి ఎంతసేపు పట్టిందంటూ ఆమెను ప్రశ్నించారు. అలాగే కొద్దిసేపు ఆ చిన్నారితో ముచ్చటించారు. అప్పుడామె 'మీరే నా ఐడల్' అంటూ చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను కేంద్రమంత్రి పియూష్ గోయల్ ట్విటర్‌లో షేర్ చేశారు.
అక్కడే ఉన్న ఓ బాలుడు దేశభక్తి గీతం పాడి వినిపించారు. ఆ పాట వింటున్నంత సేపు.. మోదీ చిటికెలు వేస్తూ అతడిని ఉత్సాహపరిచారు. తర్వాత వాహ్ అంటూ మెచ్చుకున్నారు. మిగతావారు ఆయనకు చేతులు ఊపుతూ పలకరించారు. కొందరైతే ఆయన పాదాలకు నమస్కరించారు. ఈ ఆత్మీయ స్వాగతంపై ప్రధాని ఆనందం వ్యక్తం చేశారు. 'జర్మనీలోని ప్రవాస భారతీయుల్ని కలుసుకోవడం సంతోషంగా ఉంది. మీ పట్ల దేశం గర్విస్తోంది' అంటూ తన ఫేస్‌బుక్ పేజ్‌లో ఆ చిత్రాలను షేర్ చేశారు.
ఇక ఐరోపా పర్యటనలో భాగంగా తొలుత జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో కలిసి భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల (ఐజీసీ) సమావేశంలో మోదీ పాల్గొన్నారు. అలాగే, మంగళవారం నాడు డెన్మార్క్ చేరుకోనున్న మోదీ.. రెండో భారత్-నార్డిక్ సదస్సులో డెన్మార్క్, ఐస్‌లాండ్, ఫిన్లాండ్, స్వీడన్, నార్వే దేశాధినేతలతో భేటీ అవుతారు. డెన్మార్క్ నుంచి భారత్ తిరిగి వస్తూ పారిస్‌లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ని ప్రధాని మోదీ కలవనున్నారు.
ఇదీ చదవండి: జర్మనీకి మోదీ.. ఐరోపా టూర్ షురూ