PM Modi speaks with Egyptian President : భారత్ ప్రధాని నరేంద్ర మోదీ.. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా అల్-సిసితో ఫోన్లో సంభాషించారు. గాజాపై ఇజ్రాయెల్ జరుపుతున్న సైనిక కార్యకలాపాలు, ప్రస్తుత పరిస్థితి వల్ల తలెత్తే ప్రమాదంపై ఇరువురు నేతలు చర్చించారు. సంభాషణలో భాగంగా ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణం కోసం ప్రాంతీయ, అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాలను సమన్వయం చేయడానికి ఈజిప్టు నిరంతరాయంగా ప్రయత్నిస్తోందని మోదీకి అల్- సిసి వివరించారు. ఈ మేరకు ఈజిప్టు అధ్యక్షుడి అధికార ప్రతినిధి ఫేస్బుక్ వేదికగా తెలిపారు.
"అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్- సిసికి భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. గాజాలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు. గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ భూతల దాడికి సంబంధించిన ప్రమాదకరమైన, మానవతా పరిణామాలపై అల్- సిసి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి అంతర్జాతీయ సమాజం ఏకీకృత తక్షణ పరిష్కారాన్ని కనుగొనాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. దౌత్య స్థాయిలో పౌరులకు మానవతా సాయం అమలు చేయడం, మానవతా సహాయాన్ని గాజాలోకి తక్షణమే, అంతరాయం, అడ్డంకులు లేకుండా అనుమతించాలని అవసరాన్ని తెలిపారు. దీంతో పాటు భారత్, ఈజిప్టు దౌత్య సంబంధాలపై ఇరువురు నేతలు సంతృప్తి వ్యక్తం చేశారు. రెండు స్నేహపూర్వక దేశాల మధ్య ఉమ్మడి సహకారాన్ని మరింత పెంపొందించే దిశగా నేతలిద్దరూ సంకల్పించారు" అని అల్- సిసి అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
గాజాకు ఎలాన్ మస్క్ సహాయం..
Gaza Ground Attack : ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో.. గాజా నగరంలో ఇంటర్నెట్, టెలికమ్యూనికేషన్ సేవలు.. స్తంభించిపోయిన నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. కీలకప్రకటన చేశారు. తన సంస్థ స్టార్‌లింక్ తరఫున గాజాలో అంతర్జాతీయ గుర్తింపు ఉన్న సహాయ బృందాలకు.. ఇంటర్నెట్ సదుపాయం కల్పించనున్నట్లు చెప్పారు. దాదాపు 20లక్షల మంది ప్రజలకు అన్ని కమ్యూనికేషన్లను నిలిపివేయడం ఆమోదయోగ్యం కాదని.. పాత్రికేయులు, వైద్య నిపుణులు, మానవతా సాయం అందించే గ్రూపులు, అమాయకులు ప్రమాదంలో ఉన్నారని.. అమెరికాకు చెందిన ఓ రాజకీయ నేత ఎక్స్‌లో పేర్కొనడంపై మస్క్ స్పందించారు. తమ సంస్థ స్టార్‌లింక్ తరఫున ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామన్నారు.
ఇజ్రాయెల్ వెంటనే దాడులు ఆపాలి : ఎర్డోగాన్
Israel Gaza War : హమాస్ మిలిటెంట్ సంస్థ లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. గాజాపై జరుపుతున్న దాడులను వెంటనే ఆపాలని.. తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ చర్యలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలు, చిన్నారులు, అమాయక పౌరులపై దాడులు చేస్తూ.. ఇజ్రాయెల్ మానవతా సంక్షోభం మరింత దిగజార్చిందని ఎర్డోగాన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా తెలివితక్కువతనానికి ఇజ్రాయెల్ ముగింపు పలకాలని ఆయన సూచించారు. పాలస్తీనా ప్రజలకు అండగా తుర్కియే నిలబడుతుందని ఎర్డోగాన్ తెలిపారు.
దుర్భర పరిస్థితుల్లోకి గాజా.. ఇంటర్నెట్ బంద్.. ఇజ్రాయెల్ టార్గెట్ రీచ్!
గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. హమాస్ వైమానిక దళాధిపతి హతం.. 150 భూగర్భ కేంద్రాలు ధ్వంసం