pakistan supreme court: పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించడంతో పాటు సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని ప్రతిపక్షాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఆదివారం పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. సోమవారం కూడా కాసేపు వాదనలు విన్న అనంతరం తదుపరి విచారణను మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. పాక్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో న్యాయమూర్తుల బెంచ్ ఈమేరకు నిర్ణయం తీసుకుంది. పాక్‌లో రాజకీయ సంక్షోభంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉమర్ అతా బందియాల్ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనాన్ని సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది.
పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదివారమే విచారణ చేపట్టగా తుది నిర్ణయం వెలువడుతుందని అంతా ఎదురుచూశారు. కానీ ఎలాంటి తీర్పు చెప్పకుండానే విచారణను ఏప్రిల్ 4కు వాయిదా వేసింది కోర్టు. దీంతో సోమవారం ఏం జరుగుతుందోనని అందరిలో ఆసక్తి నెలకొంది. సోమవారం కూడా ఎటువంటి తీర్పు వెలువడకుండానే విచారణ మంగళవారానికి వాయిదా పడింది.
ఇదీ చదవండి: శ్రీలంక అస్తవ్యస్తం.. స్టాక్ మార్కెట్లు క్రాష్.. విపక్షాలకు అధ్యక్షుడి ఆఫర్!