Pakistan PM Shehbaz Majnoo: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శనివారం ఈ కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారు. తానో తెలివితక్కువ వాడినని, అందుకే పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడు జీతం కూడా తీసుకోలేదంటూ పీఎం వ్యాఖ్యలు చేశారు.
అవినీతి, అక్రమ సంపాదన ఆరోపణల నేపథ్యంలో షరీఫ్, ఆయన కుమారులు హంజా, సులేమాన్‌లపై 2020 నవంబరులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎఫ్‌ఐఏ) మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి శనివారం ప్రత్యేక కోర్టులో విచారణ జరిగింది. షెహబాజ్ కుటుంబానికి చెందిన 28 బినామీ ఖాతాలను తాము గుర్తించామని ఎఫ్‌ఐఏ కోర్టుకు తెలిపింది. 2008 నుంచి 2018 మధ్య ఈ బినామీ ఖాతాల ద్వారా ఆయన 14 బిలియన్ల పాకిస్థానీ రూపీల అక్రమ సంపాదన ఆర్జించినట్లు ఆరోపించింది.
ఎఫ్‌ఐఏ ఆరోపణలను తోసిపుచ్చిన ప్రధాని.. కోర్టులో న్యాయమూర్తి అనుమతితో తన వాదన వినిపించారు. ''దేవుడి దయ వల్ల ఇప్పుడు నేడు దేశానికి ప్రధానమంత్రిని అయ్యాను. నేను ఒక మజ్నూని(ఫూల్). అందుకే, 12.5 ఏళ్ల నా పదవీకాలంలో ప్రభుత్వం నుంచి నేనేమీ తీసుకోలేదు. పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడు కనీసం జీతం కూడా తీసుకోలేదు. నా న్యాయపరమైన హక్కులనూ వినియోగించుకోలేదు. నేను పంజాబ్ సీఎంగా ఉన్నప్పుడు చక్కెర ఎగుమతులపై పరిమితులు విధించాను. ఆ సమయంలో సెక్రటరీ నాకు ప్రయోజనం చేకూర్చే ఓ నోట్ పంపినా దాన్ని నేను తిరస్కరించాను. దాని వల్ల నా కుటుంబం 2 బిలియన్ల పాకిస్థానీ రూపీలు నష్టపోయింది. నా కుమారుడు ఇథనాల్ ఉత్పత్తి యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు కూడా నేను ఇథనాల్‌పై సుంకం విధించాను. ఆ నిర్ణయంతో నా కుటుంబం 800 మిలియన్ల పాకిస్థానీ రూపీలను కోల్పోవాల్సి వచ్చింది. రాజకీయ కుట్రలో భాగంగానే నాపై మనీలాండరింగ్ కేసులు మోపారు.'' అని వాపోయారు.
1997లో షెహబాజ్ పంజాబ్ ప్రావిన్స్‌కు తొలిసారిగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అప్పుడు ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ పాక్ ప్రధానిగా ఉన్నారు. ఆ తర్వాత 1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత.. షెహబాజ్ కుటుంబం దేశం విడిచి వెళ్లిపోయింది. ఎనిమిది సంవత్సరాలు సౌదీ అరేబియాలో అజ్ఞాతంలో ఉండి 2007లో తిరిగి స్వదేశానికి వచ్చింది. ఆ తర్వాత 2008లో షెహబాజ్ మళ్లీ పంజాబ్ సీఎంగా ఎన్నికయ్యారు. 2013లోనూ మూడోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు.
ఇటీవల ఇమ్రాన్ ఖాన్‌పై అవిశ్వాసంతో ఆ ప్రభుత్వం కూలిపోవడంతో షెహబాజ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం షెహబాజ్ కుమారుడు హంజా పంజాబ్ ప్రావిన్స్‌కు సీఎంగా ఉన్నారు. సులేమాన్ యూకేలో ఉన్నట్లు సమాచారం. షెహబాజ్ పీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఇమ్రాన్‌ఖాన్ ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి కేసులను ఎదుర్కొంటున్న వ్యక్తి ప్రధాని అవడం దేశానికి అవమానకరమని ఇమ్రాన్ దుయ్యబట్టారు.
ఇవీ చూడండి: కశ్మీర్‌పై మారని పాక్ వైఖరి.. భారత్‌తో సంబంధాల మాటేమిటి?