పాకిస్థాన్ వరదలతో అల్లాడిపోతోంది. సగానికి పైగా పాక్ భూభాగం వరదను ఎదుర్కొంటోందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది జులై నుంచి దేశంలో అసాధారణ రుతుపవన ప్రభావం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా సింధ్, బలోచిస్థాన్, ఖైబర్ పక్తుంఖ్వాలో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలోని 150 జిల్లాల్లో 110 చోట్ల వరదలు వచ్చినట్లు పాక్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(ఎన్‌డీఎంఏ) లెక్కలు చెబతున్నాయి. వరదల్లో ఇప్పటివరకు 1,136 మంది ప్రాణాలు కోల్పోగా, 1575 మంది గాయపడ్డారు. మొత్తంగా 10 బిలియన్ డాలర్ల మేర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడింది.
2012 వరదలను మించి..
దేశ జనాభాలో దాదాపు 15శాతానికి సమానమైన 3.3 కోట్ల మంది ప్రజలు ఈ వరదల కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యారు. 2010లో పాకిస్థాన్ చవిచూసిన 'సూపర్ ఫ్లడ్' కంటే ఇది తీవ్రమైంది. నాటి వరదల్లో 20 మిలియన్ల మంది ప్రభావితం అయ్యారు. దేశం సగం నీటిలో ఉందని పాక్ పత్రిక ‘డాన్’ ఏకంగా కథనం ప్రచురించింది. ఈ సారి వరదల్లో ఇప్పటి వరకు 1061 మంది చనిపోగా.. 4,52,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. మొత్తం 2,18,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో మెరుపు వరదల కారణంగా వేల సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. దాదాపు 8 లక్షల పశువులు చనిపోగా.. దాదాపు 20 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి.
పాక్‌లో సగం ఉండే బలోచిస్థాన్‌లో కనీసం 75శాతం భూభాగం వరదలకు ప్రభావితమైంది. ఆస్తి నష్టానికి అంతేలేదు. 4,100 కిలోమీటర్ల రోడ్లు, 149 వంతెనలు, టెలికాం, విద్యుత్తు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 15 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లి ఉంటుందని డాన్ పత్రిక కథనం పేర్కొంది.
ఎనిమిది వారాలు ఏకధాటిగా వర్షపాతం..
భారత్‌లో మాదిరిగానే పాకిస్థాన్‌కు కూడా నైరుతి రుతుపవనాలు వర్షాలను తీసుకొస్తాయి. ఇక్కడ వర్షాకాలం భారత్‌తో పోలిస్తే కొంచెం తక్కువగా ఉంటుంది. జులైలో మొదలై సెప్టెంబర్ వరకు ఉంటుంది. ఈ మూడు నెలల్లో 140 మిల్లీమీటర్ల వర్షం కురుస్తుంది. అత్యధిక వర్షపాతం జులై, ఆగస్టుల్లోనే ఉంటుంది. కానీ, ఈ సారి అక్కడ జూన్ నుంచే వర్షాలు మొదలయ్యాయి. ఆగస్టు నాటికి అనూహ్యంగా దేశంలో అత్యధిక భాగం నీట మునిగింది. ఒక్క ఆగస్ట్‌లోనే సాధారణ వర్షపాతం కంటే రెండింతలు కురిసింది. సాధారణంగా ఆగస్టులో 50.4 మిల్లీమిటర్లు కురుస్తుంది.
కానీ, ఈ సారి 176 మిల్లీమీటర్లుగా నమోదైంది. సింధ్ ప్రావిన్స్‌లో అయితే సాధారణ వర్షపాతానికి 8 రెట్లు అధికంగా వానలు కురిశాయి. ఈ ప్రావిన్స్‌లోని అత్యధికంగా వరి, పత్తి పండిస్తారు. ఇప్పుడా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాక్‌లోని ఖైబర్ పక్తుంఖ్వాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన మనూర్ వ్యాలీలో మెరుపు వరదలు అక్కడ 10 వంతెనలను కూల్చేశాయి. ఫలితంగా ఆహారం, ఔషధాల సరఫరా కష్టంగా మారిపోయింది.
బలోచిస్థాన్‌లో 5 రెట్లు అధికంగా వర్షం పడింది. దాదాపు ఎనిమిది వారాల పాటు ఏకధాటిగా కురిసిన వర్షాలను దేశం ఎప్పుడూ చూడలేదని క్లైమెట్ ఛేంజ్‌శాఖ మంత్రి షెర్రీ రహ్మాన్ పేర్కొన్నారు. ఇప్పటికే పాక్ దేశవ్యాప్తంగా 354.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణ వర్షపాతమైన 113 కంటే మూడు రెట్లు అధికం. భవిష్యత్తులో మరిన్ని వర్షాలు కురిసే ప్రమాదం ఉందని పాక్ వాతావరణ శాఖ అంచనావేస్తోంది.
మోదీ ట్వీట్, జిన్‌పింగ్ సాయం
ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సానుభూతి వ్యక్తం చేశారు. పాక్‌లో వరదల విధ్వంసం తనకు బాధ కలిగించిందన్నారు. బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలుపుతున్నామని ట్వీట్ చేశారు. వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలని ఆశాభావం వ్యక్తం చేశారు. పాక్ మిత్రదేశమైన చైనా సైతం ఆ దేశ వరదలపై స్పందించింది. ప్రకృతి విపత్తులను కలిసి కట్టుగా ఎదుర్కొంటున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పేర్కొన్నారు. వరదలు సంభవించగానే చైనా సత్వరమే స్పందించిందని గుర్తు చేశారు. పాక్‌కు అవసరమైన సహాయం చేసేందుకు ముందుంటామని అన్నారు.