ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జాంగ్ ఉన్.. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని.. ఆయన చికిత్స కోసం ఆ దేశం విదేశాల నుంచి ఔషధాలు దిగుమతి చేసుకుంటోందని దక్షిణ కొరియా వెల్లడించింది. కిమ్‌కు నిద్రలేమి, ఆల్కహాల్ డిపెండెన్సీ వంటి అనారోగ సమస్యలు మరింత తీవ్రమై ఉండొచ్చని దక్షిణ కొరియా నిఘా సంస్థ వెల్లడించింది. కిమ్ నిద్ర రుగ్మతతో బాధపడుతున్నారని.. ఆల్కహాల్, సిగరెట్ల వ్యసనం తీవ్రమైందని దక్షిణ కొరియా గూఢచారి ఏజెన్సీ తెలిపింది.
కిమ్‌కు చికిత్స చేసేందుకు ఉత్తర కొరియా ఉన్నతాధికారులు విదేశీ వైద్య సమాచారాన్ని సేకరిస్తున్నారని.. ఈ రుగ్మత తగ్గించే ఔషధాల కోసం అన్వేషిస్తున్నారని దక్షిణ కొరియా నిఘా సంస్థ వివరించింది. కిమ్ మద్యపానం, ధూమపానంపై అతిగా ఆధారపడటం వల్లే నిద్ర రుగ్మత మరింత పెరిగి.. తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని వెల్లడించింది. కిమ్ కళ్ల చుట్టూ స్పష్టమైన నల్లటి వలయాలు ఏర్పడ్డాయని కిమ్ ఇటీవల చాలా అలసిపోయినట్లు కనిపించారని వివరించింది.
అనారోగ్య సమస్యలు చుట్టుముట్టినా కిమ్ తన అలవాట్లను మార్చుకోలేక పోతున్నారని దక్షిణకొరియా నిఘా సంస్థలు తెలిపాయి. కిమ్ కోసం ఉత్తర కొరియా విలువైన బ్రాండ్‌ల విదేశీ సిగరెట్‌లను పెద్ద సంఖ్యలో దిగుమతి చేసుకుంటోందని దక్షిణ కొరియా అధికార పీపుల్ పవర్ పార్టీ శాసనసభ్యుడు ఒకరు తెలిపారు. ఇటీవల కిమ్ చిత్రాలను ఆర్టిఫిషీయల్ ఇంటెలిజన్స్ ద్వారా విశ్లేషిస్తే.. కిమ్ బరువు అనూహ్యంగా పెరిగినట్లు కనిపిస్తోందని దక్షిణ కొరియా అధికారి తెలిపారు. ఉత్తర కొరియా పాలకుడి బరువు ఇప్పుడు 140 కిలోలు ఉండొచ్చని వెల్లడించారు.
ఉత్తరకొరియాలో ఆహార సంక్షోభం పతాకస్థాయికి చేరిందన్న దక్షిణకొరియా నిఘా సంస్థ.. ధాన్యం ధరలు గరిష్ఠస్థాయికి చేరాయని తెలిపింది. ఆహారం కొనలేక ఉత్తర కొరియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించింది. నేరాలు, ఆత్మహత్యలు, ఆకలి మరణాలు ఉత్తరకొరియాలో గతంలో కంటే రెట్టింపయ్యాయని దక్షిణ కొరియా వెల్లడించింది.
ఉత్తర కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడలు ఫిబ్రవరిలో తీవ్రమైన ఆహార సంక్షోభానికి దారి తీశాయి. తీవ్రమైన ఆహార పదార్థాల కొరత కారణంగా చాలా మంది ఆకలితో చనిపోయిన పరిస్థితి ఏర్పడింది. కరోనా కట్టడి చర్యలకు తోడు పలు దేశాలు విధించిన ఆంక్షల కారణంగా దిగుమతులకు కూడా అవకాశం లేక.. ఆహార సంక్షోభం తలెత్తిందని అప్పట్లో పరిశీలకులు చెప్పారు. ఆ తరుణంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చర్యలు చేపట్టారు. అధికార పార్టీ ప్రముఖులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. ఉత్తర కొరియాలో వ్యవసాయ రంగం పరిస్థితులపై చర్చించారు. ఆహారోత్పత్తులను పెంచేందుకు చేపట్టిన చర్యలను సమీక్షించారని అప్పట్లో ఆ దేశ అధికారిక మీడియా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.