North Korea covid cases: కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల వరకు తమ దేశంలో ఒక్క కేసు కూడా రాలేదని గొప్పగా చెప్పుకుంది ఉత్తర కొరియా. ఐరాస నేతృత్వంలోని కొవాక్స్ సహా ఇతర దేశాల నుంచి టీకాల సాయాన్ని తిరస్కరించింది. ఇప్పుడు ఆ దేశంలో కొవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. ఈ క్రమంలో.. కొవిడ్‌ను అరికట్టేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం దేశ ప్రజలకు చేసిన సూచన చర్చనీయాంశంగా మారింది. కరోనాపై పోరాడేందుకు ఉప్పు నీళ్లు పుకిలించటం సహా ఇతర వంటింటి చిట్కాలను పాటించాలని సూచించింది.
సంప్రదాయ చికిత్సలే ఉత్తమమని ఓ మహిళ ఆ దేశ అధికార మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది. తన పిల్లలు రోజుకు రెండు సార్లు ఉప్పు నీటిని పుకిలిస్తారని తెలిపినట్లు పేర్కొంది. కరోనా వైరస్‌పై పోరాడేందుకు వంటింటి చిట్కాల్లోని ఉప్పు నీళ్లు ఉత్తమమైనవి, వాటినే ప్రభుత్వం సిఫార్సు చేస్తున్నట్లు న్యూస్ ఏజెన్సీ తెలిపిందని, దాంతో పాటు విల్లో ఆకుల నీటిని రోజుకు మూడుసార్లు తాగాలని సూచించినట్లు తెలిపింది. ఈ ఆకులను జ్వరం లక్షణాలను తగ్గించేందుకు ఉపయోగిస్తారు. 'కరోనాపై పోరాటంలో అల్లం టీ ఉపయోగపడుతుంది. కరోనా అనగానే ముందుగా భయపడ్డాను. కానీ, వైద్యుల సలహాలు పాటించాక పెద్ద విషయమేమీ కాదని భావిస్తున్నా.' అని ఆ మహిళ పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.
1.7 మిలియన్ కేసులు: ఆ దేశ అధికారిక మీడియో కేసీఎన్ఏ ప్రకారం.. దేశంలో 1.7 మిలియన్లకు పైగా ప్రజలు జ్వరం లక్షణాలతో బాధపడుతున్నారు. బుధవారం ఒక్క రోజే 2.32 లక్షల మందికి జ్వరం లక్షణాలు బయటపడగా.. ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 62కు పెరిగింది. ప్రస్తుతం 6,91,170 మంది క్వారంటైన్లో ఉన్నారు. అయితే, జ్వరం లక్షణాలను ఇప్పటి వరకు కరోనాగా గుర్తించలేదు కిమ్ సర్కార్. అధికారికంగా చెప్పిన సంఖ్య కంటే కేసులు పలు రెట్లు అధికంగా ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే, ఇప్పటికే 10 లక్షలకుపైగా ప్రజలు అనుమానిత కొవిడ్ నుంచి కోలుకున్నట్లు బుధవారం వెల్లడించింది ఉత్తర కొరియా. పరీక్షలు చేసేందుకు సరైన వసతులు లేకపోవటం వల్ల చాలా కేసులను కొవిడ్-19గా గుర్తించలేకపోతున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. సరైన ఔషధాలు, వైద్య సామగ్రి, సౌకర్యాలు లేకపోయినప్పటికీ పది లక్షల మంది ప్రజలు ఎలా కోలుకున్నారనేది ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. జ్వరం లక్షణాలు కాస్త తగ్గగానే క్వారంటైన్ నుంచి పంపించేస్తున్నట్లు అనుమానిస్తున్నారు.
డబ్ల్యూహెచ్ఓ ఆందోళన: కరోనా సమాచారం అందించాలని కోరినప్పటికీ ఉత్తర కొరియా స్పందించటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. 'ఉత్తర కొరియాలో కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన చెందుతోంది. ఆ దేశంలోని చాలా మంది ప్రజలు కొవిడ్ బారిన పడే అవకాశం ఉంది.' అని పేర్కొన్నారు. ఎలాంటి పరీక్షలు చేయకపోవటం వల్ల జరిగే వ్యాప్తి కొత్త వేరియంట్లు ఉద్భవించేందుకు దోహదం చేస్తుందని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర విభాగం చీఫ్ డాక్టర్ మైకెల్ ర్యాన్ పేర్కొన్నారు. ఆయా దేశాలు తమ సాయాన్ని అంగీకరించనంత వరకు కొవిడ్ కట్టడికి డబ్ల్యూహెచ్ఓ ఏమీ చేయలేదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: కొరియాపై కరోనా పంజా.. కిమ్ 'స్పెషల్ ఆపరేషన్'.. వారికి వార్నింగ్!