బ్రిటన్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ప్రధాని పదవి నుంచి లిజ్ ట్రస్‌ను దించేసి మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌తో భర్తీ చేయడానికి రెబల్స్ పన్నాగం పన్నినట్లు ఓ నివేదిక బహిర్గతమైంది. మెజార్టీ కన్జర్వేటివ్ పార్టీ రెబల్స్ అభిప్రాయంతో కూడిన ఓ నివేదిక బహిర్గతమైంది. బ్రిటన్‌లో రాజకీయం మరోసారి సంక్షోభం దిశగా సాగుతోందని ది టైమ్స్ యు గోవ్ పోల్ వెల్లడించింది. ట్రస్ సారథ్యంలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా ఆర్థిక మంత్రి క్వాసీని పదవి నుంచి తప్పించి, ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా లిజ్ ట్రస్ నియమించారు.
ఈ సంక్షోభ పరిస్థితులు అధికార కన్జర్వేటివ్ పార్టీకి సహించడం లేదు. లిజ్ ట్రస్‌ను పార్టీ నేతగా తప్పించి, రిషి సునాక్‌ను గద్దె ఎక్కించే యత్నం జరుగుతోందని కన్జర్వేటివ్ పార్టీలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలో సగం మంది నేతలు తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే భావనలో ఉన్నట్లు ది టైమ్స్ నిర్వహించిన యు గోవ్ పోల్‌లో వెల్లడైంది. సుమారు 62 శాతం మంది తాము తప్పుడు అభ్యర్థిని ఎన్నుకున్నామనే పశ్చాత్తాపంలో ఉన్నారని 15 శాతం సభ్యులు మాత్రం తమ నిర్ణయం సరైందేననే అభిప్రాయం వ్యక్తం చేశారని ఈ నివేదిక తెలిపింది. రిషి సునాక్‌తో పాటు ప్రత్యామ్నాయ అభ్యర్థుల పరిశీలనను సైతం టోరీ సభ్యులు ప్రారంభించారని అందులో ప్రధాని అభ్యర్థి రేసులో మూడో స్థానంలో నిలిచిన పెన్నీ మోర్డాంట్ ఉన్నారని ఆ పోల్ వెల్లడించింది.
అయితే యూకే యూకే చట్టాల ప్రకారం లిజ్ ట్రస్‌కు ఏడాదిపాటు పదవీ గండం ఎదురు కాదు. ఒకవేళ 1922 బ్యాక్ బెంచ్ ఎంపీల కమిటీ... తన రూల్స్ మారిస్తే మాత్రం ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. అప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల మద్దతుతో.. రిషి సునాక్, పెన్నీ మోర్డాంట్ ప్రధాని, ఉపప్రధాని పదవులను అందుకోవచ్చు. కానీ ఇదంత సులభమైన విషయమేమీ కాదని ఎంపీ నాడైన్ డోరీస్ చెబుతున్నారు.