WEF Davos 2022: యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోన్న సమయంలో వ్యాక్సిన్ తయారీ, పంపిణీపై భారత్ అనుసరించిన విధానం పట్ల అంతర్జాతీయంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. సరైన సమయంలో వ్యాక్సిన్ ఉత్పత్తిని గణనీయంగా పెంచడంతోపాటు ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ సరఫరా చేయడంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న నేతలు కొనియాడారు. వ్యాక్సిన్ సమానత్వం, విస్తృత స్థాయిలో పంపిణీ చేయడంలో భారత్ అనుసరించిన విధానాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని సూచించారు. ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా మారే దిశగా అడుగులు వేస్తోన్న భారత్.. ఇతర దేశాలకు వ్యాక్సిన్ సరఫరా స్థాయిలో ఉందని అంతర్జాతీయ వేదికపై నేతలు ఉద్ఘాటించారు.
వ్యాక్సిన్ తయారీ సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుకున్న భారత్‌కు ఘనత పొందే అర్హత ఉందని వెల్‌కమ్ ట్రస్ట్ డైరెక్టర్ జెరేమి ఫ్యారర్ పేర్కొన్నారు. "కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసిన వెంటనే దానిని ప్రపంచ వ్యాప్తంగా అందించేందుకు తీవ్ర కృషి జరిగింది. ఆ సమయంలో జాతీయవాదం, ఎగుమతులపై నిషేధం వంటి ఆటంకాలు ఎదురయ్యాయి. అయినప్పటికీ క్రమంగా అవి పరిష్కారమవుతూ వచ్చాయి. ఈ క్రమంలో విస్తృత స్థాయిలో వ్యాక్సిన్ తయారీకి భారత వ్యాక్సిన్ సంస్థలు చేసిన కృషి అభినందనీయం" అని వ్యాక్సిన్ అలయన్స్ 'గావీ' సీఈఓ సేత్ ఎఫ్ బెర్క్లీ పేర్కొన్నారు. ఇక వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వస్తోన్న సమయంలో కొన్ని దేశాలు ప్రాధాన్యత వేరుగా ఉన్నప్పటికీ భారత్ మాత్రం వ్యాక్సిన్ సమానత్వం, అందరికీ అందుబాటులో ఉంచేందుకు తీసుకున్న చర్యలను ప్రతి ఒక్కరూ అనుసరించాల్సి ఉందని ఆక్స్‌ఫామ్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గబ్రియెలా బుచర్ స్పష్టం చేశారు.
ఇదే ప్యానెల్‌లో మాట్లాడిన నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్.. సెకండ్ వేవ్ ప్రభావం దారుణంగా ఉన్న సమయంలో దేశంలో కేవలం రెండే వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నాయన్నారు. కానీ, ప్రస్తుతం పది కంపెనీలు వ్యాక్సిన్‌లు తయారు చేస్తున్నాయని.. మరో 14 వ్యాక్సిన్‌లు వివిధ దశల్లో ఉన్నాయని చెప్పారు. ఇలా ఇప్పుడు ప్రపంచానికి వ్యాక్సిన్ క్యాపిటల్‌గా ఎదిగే క్రమంలో ఉన్నామని అమితాబ్ కాంత్ ఉద్ఘాటించారు. కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతున్న వేళ టెస్టింగ్ నుంచి ట్రీట్‌మెంట్, వ్యాక్సిన్ వంటి విషయాలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొన్న నిపుణులు చర్చించారు. మున్ముందు మహమ్మారిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయని.. అయితే, వీటిని సరైన రీతిలో వినియోగించుకుంటేనే అది సాధ్యమని నొక్కిచెప్పారు.
ఇదీ చూడండి: 'భారత్, జపాన్ దోస్తీ ఎంతో స్పెషల్'