Israel Palestine Issue : ఇజ్రాయెల్, పాలస్తీనా దేశాల్లో రక్తపుటేరులు పారుతున్నాయి. పరస్పర దాడుల్లో వందలాది మంది పౌరులు బలవుతున్నారు. పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్లు.. శనివారం గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్‌పైకి వేలాది రాకెట్లు ప్రయోగించారు. వెంటనే గాజా గుండా భూ, వాయు, సముద్ర మార్గాల్లో పెద్ద సంఖ్యలో చొరబడి విధ్వంసం సృష్టించారు. ఇజ్రాయెల్ పట్టణాల్లో హమాస్ మిలిటెంట్లు తుపాకులతో స్వైర విహారం చేశారు. ఇజ్రాయెల్ పట్టణాలు, నగరాల్లో 22 చోట్ల హమాస్ ఉగ్రవాద బృందాలకు, ఇజ్రాయెల్ సైన్యానికి మధ్య పోరు సాగింది. అయితే 14 ప్రాంతాలను ఇజ్రాయెల్ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుని ముష్కరులను మట్టుబెట్టింది.
'వందలాది మంది ఉగ్రవాదులు హతం'
Israel Hamas Latest News : హమాస్‌కు చెందిన వందలాది మంది ఉగ్రవాదులను తాము మట్టుబెట్టామని ఇజ్రాయెల్ సైనిక అధికారి డేనియల్ హగారి వెల్లడించారు. అనేక మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. హమాస్ ఉగ్రవాదులు.. ఇజ్రాయెల్‌లో అనేక మందిని హతమార్చారని చెప్పారు. వేలాది రాకెట్లను ప్రయోగించి విధ్వంసం సృష్టించినట్లు పేర్కొన్నారు. హమాస్ ముష్కరులు పలువురు ఇజ్రాయెల్ పౌరులను బందీలుగా చేసుకుని గాజాకు తీసుకెళ్లారని చెప్పారు. వారిలో మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులు అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇజ్రాయెల్ దూకుడు.. ఏరివేత ఆపరేషన్ తీవ్రం
Israel Gaza War News : మరోవైపు, అకస్మాత్తుగా జరిగిన దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ సైన్యం ముందుగా తమ భూభాగాన్ని తమ ఆధీనంలో తెచ్చుకునే చర్యలను వేగవంతం చేసింది. హమాస్ ముష్కరులను ఏరిపారేస్తూ ముందుకు సాగుతోంది. చొరబాటుదారుల ఏరివేత ఆపరేషన్‌ను ఇజ్రాయెల్ సైన్యం తీవ్రం చేసింది. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత స్థాయిలో సైన్యాన్ని మోహరించింది. దాడులకు మూల కేంద్రంగా ఉన్న గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళం విరుచుకుపడింది. గాజా నుంచి పాలస్తీనా పౌరులు ఖాళీ చేయాలని.. అక్కడి ఉగ్ర రహస్య స్థావరాలను శిథిలాల కుప్పగా మారుస్తామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
'ఏ చర్యలకైనా వెనకాడబోం'
Israel Vs Palestine : తమ పౌరులను కాపాడుకోవడానికి అవసరమైన ఏ చర్యలకైనా వెనకాడబోమని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి ఇజ్రాయెల్ ప్రతినిధి గలీద్ ఎర్డాన్ వెల్లడించారు. ప్రస్తుతం గాజా నుంచి జరుగుతున్న దాడుల నుంచి తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని ఐక్యరాజ్య సమితికి స్పష్టం చేశారు.
'యుద్ధంలో గెలుపు మాదే'
Israel Palestine Conflict : ఈ యుద్ధంలో తప్పకుండా గెలుస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆశాభావం వ్యక్తం చేశారు. అత్యున్నత సైనికాధికారులతో సమావేశమైన ఆయన.. చొరబాటుదారులను ఏరివేయాలని ఆదేశించారు. ఆ తరువాత శత్రువుల అంతుచూడాలని స్పష్టం చేశారు. మరెవరూ మిలిటెంట్ గ్రూపులో చేరనంత స్థాయిలో ప్రతిఘటన ఉండాలని సూచించారు. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధంతో అతలాకుతలమవుతున్న ప్రపంచానికి ఇజ్రాయెల్- పాలస్తీనా దాడులు మరో తలనొప్పిని తెచ్చిపెట్టాయి. 1973లో పొరుగు దేశాలతో ఇజ్రాయెల్ చేసిన యుద్ధానికి 50 ఏళ్లయిన సందర్భంగా హమాస్ ఈ దాడికి దిగింది.
ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం గురించి ఈటీవీ భారత్ అందించిన కథనాలు..
- Israel Palestine Conflict : ఇజ్రాయెల్-పాలస్తీనా గొడవకు కారణం ఇదే!.. 'హమాస్' ఎలా ఏర్పడిందంటే?
- Israel Vs Palestine : 'బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడిపాం'.. భీకర యుద్ధంలో 500 మంది మృతి!.. హమాస్‌కు ఇజ్రాయెల్ ప్రధాని మాస్ వార్నింగ్
- Israel Hezbollah War : ఇజ్రాయెల్ X హమాస్.. యుద్ధంలోకి 'హెజ్బొల్లా' సంస్థ ఎంట్రీ.. రాకెట్లు, షెల్స్‌తో దాడి..