Iran President Ahmed Raisi : ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్న యాంకర్ ఎదుట ఖాళీ కుర్చీ ఉన్న ఈ చిత్రం వెనుక ఓ ఆసక్తికర ఘటన ఉంది. ఆ మహిళ పేరు క్రిస్టియన్ అమన్పూర్. ఇరానీ-బ్రిటన్ కుటుంబంలో జన్మించిన ఈమె సీఎన్‌ఎన్‌లో చీఫ్ ఇంటర్నేషనల్ యాంకర్. అమెరికా ప్రభుత్వ నిర్వహణలోని పీబీఎస్‌లోనూ ఓ షో చేస్తున్నారు. అమన్పూర్ తన ట్విటర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్టు చేసి.. దీని వెనుక ఉన్న కథను వివరించారు. న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిలో ప్రసంగించేందుకు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఇటీవల న్యూయార్క్‌కు వచ్చారు.
రైసీ ఇంటర్వ్యూ తీసుకోడానికి అమన్పూర్ కొన్ని వారాల ముందే ప్లాన్ చేశారు. అన్నీ సిద్ధం చేసుకున్నారు. మరో 40 నిమిషాల్లో ఇరాన్ అధ్యక్షుడు వస్తారనగా ఆయన సహాయకుడు ప్రత్యక్షమయ్యారు. అమన్పూర్‌ను హిజాబ్ ధరించాల్సిందిగా అధ్యక్షుడు కోరుతున్నట్లు తెలిపారు. తాము న్యూయార్క్‌లో ఉంటున్నామంటూ ఆ మాటను ఆమె తిరస్కరించారు. ససేమిరా అన్న సహాయకుడు అమన్పూర్ హిజాబ్ ధరిస్తేనే ఇంటర్వ్యూ జరుగుతుందని తేల్చి చెప్పారు. అమన్పూర్ ఇంటర్వ్యూ రద్దు చేసుకున్నారు. "ఓ పక్క ఇరాన్‌లో హిజాబ్ గురించే జరుగుతున్న తీవ్ర ఆందోళనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడటానికి ఇది చాలా కీలక సమయం" అంటూ ఆమె విచారం వ్యక్తం చేశారు.
అసలేం జరిగింది:
ఇరాన్‌లో 22 ఏళ్ల మాసా అమీని మరణంతో దేశవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు చెలరేగాయి. పోలీసుల అదుపులో ఉన్న అమీనిని తీవ్రంగా కొట్టి, హింసించడం వల్లే మృతి చెందిందని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. హిజాబ్ సరిగా ధరించకపోవడం వల్ల అమీనిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దేశవ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు మిన్నంటాయి. అమీనికి న్యాయం జరగాలంటూ హింసాత్మక నిరసనలు జరుగుతున్నాయి. అందులో ఇప్పటివరకు 31 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య 26కి పైగా ఉందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ వెల్లడించింది. అమీని మరణంపై విచారణ జరుపుతామని ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ తెలిపారు.
ఇదీ చదవండి: అఫ్గాన్‌లో బాంబు దాడి.. ఏడుగురు దుర్మరణం.. 41మందికి తీవ్ర గాయాలు