Environmental performance index: పర్యావరణ పనితీరు సూచీ(ఈపీఐ)-2022లో భారత్ ర్యాంకు మరింత దిగజారింది. 180 దేశాల జాబితాలో అత్యల్పంగా 18.9 పాయింట్లు సాధించి ఏకంగా అట్టడుగున నిలవడం గమనార్హం. 77.90 పాయింట్లతో డెన్మార్క్ అగ్ర స్థానంలో నిలిచింది. బ్రిటన్, ఫిన్లాండ్, మాల్టా, స్వీడన్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొన్నేళ్లుగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో అవి సఫలమయ్యాయని నివేదిక పేర్కొంది. అమెరికాలోని యేల్ యూనివర్సిటీకి చెందిన యేల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ లా అండ్ పాలసీ, కొలంబియా యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సుస్థిరతపై ఈపీఐ.. గణాంకాలతోసహా పూర్తిస్థాయి నివేదికను అందిస్తుంది. 11 విభాగాల్లో 40 సూచికలను ఆధారంగా చేసుకుని.. వాతావరణ మార్పులు, పర్యావరణ సమతుల్యత, జీవ వైవిధ్యం, వాయునాణ్యత తదితర అంశాల్లో ర్యాంకులు కేటాయిస్తుంది. ఆయా దేశాలు తమ పర్యావరణ లక్ష్యాలకు ఎంత దగ్గరగా ఉన్నాయో సైతం అంచనా వేస్తుంది. ‘దిగజారుతున్న వాయు నాణ్యత, వేగంగా పెరుగుతున్న గ్రీన్హౌస్ వాయు ఉద్గారాల కారణంగా భారత్ మొదటిసారిగా ర్యాంకింగ్స్‌లో దిగువకు పడిపోయింది’ అని నివేదిక పేర్కొంది. మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు భారత్ కన్నా పై స్థానాల్లో నిలిచాయి.
గ్రీన్‌హౌజ్ వాయువులకు అడ్డుకట్ట వేస్తామని పేర్కొన్నప్పటికీ.. 2050 నాటికి చైనా, భారత్‌లు ఈ ఉద్గారాల విడుదల విషయంలో తొలి రెండు స్థానాల్లో నిలుస్తాయని పరిశోధకులు అంచనా వేశారు. డెన్మార్క్, బ్రిటన్ తదితర కొన్ని దేశాలు మాత్రమే 2050 నాటికి ఈ ఉద్గారాలను కట్టడి చేయగలవన్నారు. ‘గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాల నియంత్రణ విషయంలో అనేక దేశాలు తప్పుడు దిశలో పయనిస్తున్నాయి. చైనా, భారత్, రష్యా వంటి ప్రధాన దేశాల్లో సమస్య వేగంగా పెరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 2050 నాటికి కేవలం చైనా, భారత్, అమెరికా, రష్యాలు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా 50 శాతానికి పైగా గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలకు కారణమవుతాయి’ అని నివేదిక పేర్కొంది.
ఇదీ చదవండి: అమెరికాకు శరణార్థుల దండు.. కాలినడకనే పయనం.. టార్గెట్ అదే!