శ్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపనుందని వస్తున్న వార్తలను కొలంబోలోని భారత హై కమిషన్ ఖండించింది. అలాంటి వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. గతంలో కూడా ఇలాంటి వదంతులే రాగా అప్పుడు కూడా భారత్ ఈ తప్పుడు వార్తలను ఖండించింది. కొన్ని ఛానళ్లు సహా సామాజిక మాధ్యమాల్లో శ్రీలంకకు భారత్ సైన్యాన్ని పంపుతుందనే వార్త విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ మేరకు కొలంబోలోని భారత్ హైకమిషన్ స్పష్టతనిచ్చింది. అలాంటి ఉద్దేశమేదీ భారత ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది.
ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రగతి కోసం తమ ఆకాంక్షలను నెరవేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజల పక్షాన భారత్ నిలుస్తుందని భారత హైకమిషన్ పేర్కొంది. ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్ అండగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు 3.8 బిలియన్ డాలర్ల సాయమందించామని ఇకపైనా ఈ సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది.
ఇవీ చదవండి: జపాన్లో షింజో పార్టీదే విజయం.. వీచిన సానుభూతి పవనాలు