China Fire Accident: చైనాలోని హెనాన్ రాష్ట్రంలో ఉన్న రసాయనాల నిల్వ గోదాములో జరిగిన అగ్ని ప్రమాదంలో 36 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడగా మరో ఇద్దరు గల్లంతయ్యారు. సోమవారం సాయంత్రం 4గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు వెన్‌ఫాంగ్ జిల్లా యంత్రాంగం తెలిపింది. అగ్నిమాపక సిబ్బంది 4 గంటలు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొంది. ప్రమాద కారణాలపైగానీ ఎంతమంది కార్మికులు మృతిచెందారనే విషయంపైగానీ అధికారికంగా వివరాలు వెల్లడించలేదు.
రసాయనాలు నిల్వ చేయడంలో సరైన ప్రమాణాలను పాటించకపోవడం, బయటకు వెళ్లే మార్గాలను మూసివేయడం, సరైన అగ్నినిరోధక సామగ్రి లేకపోవడం ప్రమాదానికి కారణాలని భావిస్తున్నారు. ప్రత్యేకమైన రసాయనాలు, పారిశ్రామిక ఉత్పత్తులకు తాము హోల్‌సేల్ డీలర్లమని గోదామును నిర్వహిస్తున్న కంపెనీ తన ఆన్‌లైన్ లిస్టింగ్‌లో వివరించింది. ప్రమాదం జరిగిన వెంటనే 200 మంది సహాయ సిబ్బంది, 60 మంది అగ్నిమాపకసిబ్బంది రంగంలోకి దిగారని అధికారులు వివరించారు.