Emirates jet hole: విమానం గాల్లో ప్రయాణిస్తుండగా పెద్ద రంధ్రం పడిన ఘటన ఇది. దాదాపు 14 గంటల ప్రయాణం అనంతరం విమానాశ్రయంలో ల్యాండ్ అయిన తర్వాత ఈ విషయం బయటపడటం గమనార్హం. జులై 1న ఈ ఘటన చోటుచేసుకుంది. ఎమిరేట్స్‌కు చెందిన ఎయిర్‌బస్ ఏ380 విమానం.. దుబాయ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌కు బయల్దేరింది. అయితే, గమ్యస్థానంలో ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు పైలట్లు.. అక్కడి ఏయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)ను సంప్రదించారు. టేకాఫ్ సమయంలో విమానం టైరు పేలిందని అనుమానం వ్యక్తం చేస్తూ.. అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. సురక్షితంగా ల్యాండ్ అయ్యాక.. విమానం ఎడమ రెక్క వైపు కింది భాగంలో రంధ్రాన్ని గుర్తించారు.
విమానం ఇంకా బ్రిస్బేన్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఉందని ఎమిరేట్స్ ప్రతినిధి తెలిపారు. అధికారులు తనిఖీ చేశారని.. విమానం లోపలి భాగం, ఫ్రేమ్, నిర్మాణంపై ఎలాంటి ప్రభావం పడలేదని చెప్పారు. ఈ ఘటనలో ప్రయాణికులు గాయపడినట్లు సమాచారం లేదు. టేకాఫ్ సమయంలో లేదా కొద్దిసేపటికే ఈ ఘటన జరిగి ఉండవచ్చని కొందరు ప్రయాణికులు ఓ స్థానిక వార్తాసంస్థకు తెలిపారు. ఆ సమయంలో విమానంలో పెద్ద శబ్దం వినిపించిందని, దాదాపు 45 నిమిషాలపాటు అది కొనసాగిందని చెప్పారు. అయితే, క్యాబిన్ సిబ్బంది ప్రశాంతంగా ఉన్నారని.. రెక్కలు, ఇంజిన్‌లను తనిఖీ చేశారన్నారు.