Child Killed In Israel : ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు జరిపిన పాశవిక దాడిలో అభంశుభం తెలియని 40 మంది చిన్నారులు మరణించారు. కెఫర్ అజా కిబుట్జ్‌లో వారి మృతదేహాలను గుర్తించామని ఇజ్రాయెల్ రక్షణ దళం (ఐడీఎఫ్) వెల్లడించింది. అందులో కొన్నింటికి తలలు కూడా లేవని వారు చెప్పడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఇజ్రాయెల్‌పై హమాస్ శనివారం తొలుత ఈ ప్రాంతంలోనే దాడులు జరిపింది. అక్కడ పడి ఉన్న పౌరులు, ఉగ్రవాదుల మృతదేహాలను తీసుకెళ్లే క్రమంలో మంగళవారం ఐడీఎఫ్ ఆ ప్రాంతానికి వెళ్లింది. విదేశీ మీడియా సంస్థలను సైతం కవరేజీకి అనుమతించింది. 'ఇక్కడ కొందరు సైనికులతో మాట్లాడా. ఈ కమ్యూనిటీల గుండా వెళ్తున్నప్పుడు వారికి తలలు లేని శిశువుల మృతదేహాలు, మంచాలపైనే కాలిపడి ఉన్న మృతదేహాలు కన్పించినట్లు చెప్పారని ఓ జర్నలిస్ట్ పేర్కొన్నారు.
'ఇది యుద్ధం కాదు.. యుద్ధభూమి కాదు.. ఊచకోత..'
కిబుట్జ్ ప్రస్తుతం భీతావహంగా కన్పిస్తోందని ఇజ్రాయెల్ మేజర్ జనరల్ ఇటావ్ వెరువ్ వ్యాఖ్యానించారు. ఎక్కడ చూసినా మృతదేహాలే పడి ఉన్నాయని.. కాలిపోయిన ఇళ్లు, కార్లలో నుంచి వాటిని ఇజ్రాయెల్ సైనికులు వెలికితీశారని పేర్కొన్నారు. 'పిల్లలు, తల్లులు అనే తేడా లేకుండా మృతదేహాలు కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు వారిని ఎంత భయంకరంగా చంపారో మీరు చూడొచ్చు. ఇది యుద్ధం కాదు.. యుద్ధభూమి కాదు. ఇది ఊచకోత, ఉగ్రవాద చర్య' అని ఇజ్రాయెల్ మేజర్ జనరల్ ఇటావ్ వెరువ్ ఓ మీడియాతో వ్యాఖ్యానించారు. ఇలాంటివి తన జీవితంలో చూడలేదని అన్నారు. గతంలో యూరప్, ఇతర ప్రదేశాల్లో ఇలాంటివి జరిగినట్లు మన తాత, ముత్తాతలు చెప్పేవారని.. ఆధునిక చరిత్రలో ఇలాంటివి జరగకూడదని ఆయన అభిప్రాయపడ్డారు.
'హమాస్‌ను వదలం'
ఇంతటి దారుణానికి తెగబడిన హమాస్‌ను వదిలిపెట్టబోమని ఐరాసలో ఇజ్రాయెల్ మాజీ రాయబారి డానీ డానన్ తెలిపారు. యుద్ధం చేసే పద్ధతి మాత్రం ఇది కాదని వ్యాఖ్యానించారు. చిన్నారులతో సహా అమాయక ప్రజలను యుద్ధంలోకి లాగి కాల్చి చంపడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. హమాస్‌ను వెంటాడి, వేటాడి ఈ భూమిపై లేకుండా చేస్తామని హెచ్చరించారు.
Israel Cities Empty : నిర్మానుష్యంగా ఇజ్రాయెల్ నగరాలు .. బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడుపుతున్న ప్రజలు