Boris Johnson Resignation : పార్టీగేట్ ఆరోపణలపై యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్.. తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉక్స్‌బ్రిడ్జ్ సౌత్ రూయిస్లిప్ నుంచి ఎంపీగా ఉన్న బోరిస్.. పార్లమెంటును పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక రావాల్సిన క్రమంలో ఈ పదవికి రాజీనామా ప్రకటించారు. కొవిడ్ సమయంలో చట్టాన్ని ఉల్లంఘించి.. పార్టీ చేసుకున్నారని బోరిస్ జాన్సన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంలో హౌస్ ఆఫ్ కామన్స్‌ని ఉద్దేశపూర్వకంగా తప్పుదారి పట్టించారని విమర్శలు వచ్చాయి. ఎంపీ పదవికి రాజీనామా చేయడం బాధ కలిగించినట్లు ఈ నేపథ్యంలో బోరిస్ తెలిపారు. వెంటనే ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు.
తనను పార్లమెంటు నుంచి బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. ఎంపీగా రాజీనామా చేస్తూ.. ఓ స్టేట్మెంట్ సైతం ఆయన విడుదల చేశారు. తాను అబద్ధం చెప్పలేదని.. కమిటీకి కూడా ఈ విషయం తెలుసుని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నాడు. కమిటీని 'కంగారూ కోర్టు'గా అభివర్ణించారు బోరిస్ జాన్సస్. వాస్తవాలతో సంబంధం లేకుండా మొదటి నుంచే తనని దోషిగా గుర్తించడం దాని ఉద్దేశమన్నారు.
ప్రధాని పదవికి రాజీనామా
కొవిడ్ ఉద్ధృతంగా ఉన్న సమయంలో తన అధికారిక నివాసంలో విందు ఇచ్చిన వ్యవహారంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. సొంత పార్టీ (కన్జర్వేటివ్) విమర్శలు ఎదుర్కొన్నారు. 2020 జూన్‌లో జరిగిన ఈ విందును పార్టీగేట్ కుంభకోణంగా పేర్కొంటుండగా ఈ వ్యవహారంలో కన్సర్వేటివ్ పార్టీ సభ్యులు బోరిస్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం జరిగిన విశ్వాస పరీక్షల్లో బోరిస్ గెలిచినప్పటికి.. తన నాయకత్వానికి ఓ మచ్చ తెచ్చుకున్నారు. దీంతో తీవ్ర విమర్శల పాలైన బోరిస్ జాన్సస్.. 2022 జులై 8న యూకే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.
అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రధాని పదవికి రిషి సునాక్.. లిజ్ ట్రస్ పోటీపడ్డారు. ప్రధాని అభ్యర్థి కోసం పార్టీలో వివిధ దశల్లో జరిగిన ఎన్నికల్లో లిజ్‌ట్రస్ విజేతగా నిలిచింది. దీంతో లిజ్ ట్రస్ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఐతే తాను తీసుకున్న నిర్ణయాల కారణంగా దేశంలో ఆర్థిక సంక్షోభం మరింత ముదరడం వల్ల బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన 45 రోజుల్లోపే లిజ్ ట్రస్ వైదొలిగారు. ఈ నేపథ్యంలోనే గతంలో ఆర్థిక మంత్రిగా పని చేసిన రిషి సునాక్.. మరోసారి బ్రిటన్ ప్రధాని రేసులో నిలిచి విజయం సాధించారు. ప్రస్థుతం ఆయనే యూకే ప్రధానిగా కొనసాగుతున్నారు. కాగా ప్రధానిగా బోరిస్ జాన్సస్ రాజీనామాకు మొదటగా డిమాండ్ చేసింది రిషి సునాక్ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో తన మంత్రి పదవికి కూడా సునాక్ రాజీనామా చేశారు.